- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ డీజీ చారు సిన్హా మార్క్.. తొలి త్రైమాసికంలోనే రికార్డు స్థాయిలో కేసులు
రాష్ట్రంలో అవినీతి అంతమే లక్ష్యంగా పనిచేస్తున్న అవినీతి నిరోధక శాఖ ఏసీబీ గత పదేళ్ల రికార్డులను తిరగరాస్తూ, 2026 సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే అత్యధిక సంఖ్యలో కేసులను నమోదు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అవినీతి అంతమే లక్ష్యంగా పనిచేస్తున్న అవినీతి నిరోధక శాఖ ఏసీబీ గత పదేళ్ల రికార్డులను తిరగరాస్తూ, 2026 సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే అత్యధిక సంఖ్యలో కేసులను నమోదు చేసింది. జనవరి నుంచి మార్చి వరకు జరిగిన ఈ దాడులు, దర్యాప్తు తీరుపై ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా బుధవారం హైదరాబాద్‌లో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసిన అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా రివార్డు మేళాను ఏర్పాటు చేసి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలను అందజేశారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో నమోదైన కేసుల గణాంకాలు బ్యూరో పనితీరుకు అద్దం పడుతున్నాయని డీజీ చారు సిన్హా సంతోషం వ్యక్తం చేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో, వృత్తిపరమైన నైపుణ్యంతో వ్యవహరించడం వల్లే ఈ రికార్డు స్థాయి ఫలితాలు సాధ్యమయ్యాయని ఆమె కొనియాడారు. కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా, పక్కా ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేయడంలో అధికారులు ప్రదర్శించిన అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు. అవినీతిని అరికట్టడంలో రాజీలేని పోరాటం సాగిస్తున్న అధికారుల కృషిని గుర్తించి, వారిని గౌరవించడం వల్ల శాఖలో నూతనోత్సాహం నెలకొంటుందని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డీజీ చారు సిన్హా మాట్లాడుతూ.. అవినీతి అనేది ఒక దేశాన్ని లోలోపల డొల్లగా మారుస్తుందని, సమాజ పురోగతికి ఇది పెద్ద అవరోధమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత
ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకతను పెంపొందించడం ద్వారానే ప్రజల నమ్మకాన్ని చూరగొనగలమని, అందుకు ప్రతి అధికారి అత్యున్నత నైతిక ప్రమాణాలను పాటించాలని పిలుపునిచ్చారు. ప్రజా సేవలో చిత్తశుద్ధితో ఉంటూ, ఎక్కడా అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందించడమే తమ అంతిమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఫలితాల కోసం అధికారులు నిరంతరం శ్రమించాలని కోరారు. త్రైమాసిక సమీక్షలో వెల్లడైన పురోగతిని ఇదే వేగంతో ముందుకు తీసుకెళ్లాలని, ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ నిరంతరం నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ లోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.






