ఫార్ములా ఈ-రేస్ ఉచ్చు.. కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు నోటీసులు

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-14 13:05:08  IST  )

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఫార్ములా ఈ-రేస్ ఉచ్చు.. కేటీఆర్‌కు ఏసీబీ కోర్టు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణ నిమిత్తం జులై 31వ తేదీన స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు అప్పటి ప్రభుత్వంలోని మరికొందరు కీలక అధికారులకు కూడా ఏసీబీ కోర్టు సమన్లు పంపించింది. నోటీసులు అందుకున్న వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు.

కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-రేసింగ్ కోసం నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.55 కోట్ల మేర విదేశీ చెల్లింపులు జరిగాయని ఏసీబీ ఆరోపిస్తోంది. తగిన అనుమతులు లేకుండానే హెచ్‌ఎండీఏ నిధులను మళ్లించినట్లు అభియోగాలు చూపింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు ఇప్పటికే కోర్టులో ఛార్జీషిట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసిన ఏసీబీ, కేటీఆర్‌ను ప్రధాన సూత్రధారిగా పేర్కొంది. గవర్నర్ నుంచి ప్రాసిక్యూషన్ అనుమతులు లభించిన నేపథ్యంలో, కోర్టు ఈ ఛార్జీషీట్‌ను పరిగణలోకి తీసుకుని విచారణకు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేసింది. జులై 31వ తేదీన జరిగే విచారణలో కేటీఆర్, ఇతర అధికారులు కోర్టు ముందు హాజరై తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఈ పరిణామం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Next Story