- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 23న "రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్
ఈ నెల 23న తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపు నిచ్చింది. రేషనలైజేషన్, ఫీజుల దోపిడీ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఏబీవీపీ (ABVP) సమరశంఖం మోగించింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యం, ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీ ని వ్యతిరేకిస్తూ.. జూన్ 23న "రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వరంగల్ లోని ప్రెస్ క్లబ్ జరిగిన మీడియా సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యం అవుతుందని, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడని, ప్రభుత్వ పాఠశాలల ఎత్తివేతకు కుట్ర చేస్తూ... ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి కొమ్ముకాస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ABVP ఆధ్వర్యంలో జూన్ 23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్ కు పిలుపునిస్తున్నామని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తున్నాడని, అందుకే రేషనలైజేషన్ పేరుతో 23000 ల పాఠశాలలను మూసేందుకు కంకణం కట్టుకున్నాడని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని రాంబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నాడని, విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం రెడ్ కార్పేట్ పరిచిందని ఎద్దేవా చేశారు. వెంటనే ప్రభుత్వం ఫీజుల దోపిడీని అరికట్టి, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు. అలాగే ప్రైవేటు,కార్పొరేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లను అందించే విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వం అటకెక్కించిందన్నారు.
రాష్ట్రంలో పాఠశాలలు పర్యవేక్షణ లేకుండా నడుస్తున్నాయని కావున ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈఓ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక పర్మిషన్ పేరు మీద పలు బ్రాంచ్ లు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆర్థిక దోపిడీకి పాల్పడుతూ సరస్వతి నిలయాలు లాంటి పాఠశాలలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి ఖాళీగా ఉన్న టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,అదేవిధంగా గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలని, ఫుడ్ పాయిజన్ కి తావులేకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, NEP 2020ని, విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పాఠశాలలు రీ ఓపెన్ అయిన ఇంతవరకు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో "బ్రేక్ ఫాస్ట్ స్కీమ్" ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడి పెట్టాలని,ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థల ఆర్థిక దోపిడిని నియంత్రించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.విద్యార్థి వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 23న ఏబీవీపీ పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది. కావునా విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఈ బంద్ కు సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జూపల్లి దీపిక, రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజ్ కుమార్, విభాగ్ కన్వీనర్ ఆరిపెల్లి సుజిత్, గుంటి అభిలాష్, గుగులోత్ నవీన్, రేఖ, అఖిల్ పాల్గొన్నారు.






