- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జులై 14 న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్..పిలుపునిచ్చిన ABVP
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా జూలై 14న తెలంగాణవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఏబీవీపీ (ABVP) రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జూలై 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల నుండి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని రకాల విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రూ. 11,000 కోట్ల బకాయిలు.. విద్యార్థుల వలసలు:
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదువుకుంటున్నారని రాంబాబు తెలిపారు. గతంలో తాము అధికారంలోకి వస్తే గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి ప్రతి నెలా ఫీజులు చెల్లిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు రూపాయి విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. ఫలితంగా రూ.11,000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఈ వ్యవహారం చివరకు కోర్టు మెట్లు ఎక్కిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏటా 2 లక్షల మంది విద్యార్థులు చదువు ఆపేస్తున్నారన్నారు. సర్టిఫికెట్లు అందక 4.5 లక్షల మంది ఇబ్బంది పడుతూ, పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారన్నారు.
లెక్చరర్ల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత:
ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వం కలిసి ఆడుతున్న నాటకంలో పేద విద్యార్థులు బలి అవుతున్నారని, పొట్టకూటి కోసం లెక్చరర్‍గా మారిన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. ఈ రోజు కామారెడ్డిలో నిర్వహించిన ఈ భారీ నిరసన ర్యాలీతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని, లేకపోతే ఇదే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి అంకురార్పణ అవుతుందనని హెచ్చరించారు. అన్ని కళాశాల ప్రాంగణాలు, విశ్వవిద్యాలయాలు మరోసారి ఉద్యమ వేదికలై కాంగ్రెస్ పార్టీకి మరణశాసనం రాస్తాయన్నారు. పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తూ రాక్షసానందం పొందుతున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసన ABVP ఆధ్వర్యంలో జూలై 14 తేదీన నిర్వహించబోయే రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్‍ను విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.






