Teenmar Mallanna: స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన.. సభలో మల్లన్న కీలక డిమాండ్

by Prasad Jukanti |

ఇద్దరు పిల్లల నిబంధనపై తీన్మార్ మల్లన్న సభలో ప్రస్తావించారు.

Teenmar Mallanna: స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన..  సభలో మల్లన్న కీలక డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థలకు ఎన్నికలు (Local Body Elections) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో మరో పది రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్న ఆశావహులంతా తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. తమ అభ్యర్థిత్వం తో పాటు గెలుపుపై ఉన్న సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తాజాగా శాసనమండలిలో (Legislative Council) ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధనను ఎత్తివేయాలని మల్లన్న డిమాండ్ చేశారు. సోమవారం మండలిలో మాట్లాడిన ఆయన.. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మా బీసీలు, ఎస్సీలు, ఎస్టీల్లోని మరింత మందికి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. బీసీల అంశంపై సభలో చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ అడ్డుతగలడం సరికాదన్నారు. 70 ఏళ్లుగా బీసీలకు అన్యాయం జరుగుతోందని ఈ సభ కనీసం మా బాధ వినాలన్నారు.

జనాభా నియంత్రణలో భాగంగా ఉమ్మడి అంధ్రప్రదేశ్ సర్కార్ 1995 మే 30 న పంచాయతీరాజ్ చట్టంలోని 21వ పేజీలో 3వ అంశంగా ఈ నిబంధనను చేర్చింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని రద్దు చేశారు. దీంతో చాలా మంది పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నా ఈ నిబంధన కారణంగా పోటీకి దూరమయ్యారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఈ నిబంధనల్లో మినహాయింపు ఉన్నప్పటికీ గ్రామపంచాయతీల విషయంలో మాత్రం ఇంకా అమలులో ఉంది. దీంతో ఈ నిబంధన ఎత్తివేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Next Story