- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ ఆటో డ్రైవర్స్‌కు బిగ్ అలర్ట్.. ఆ మిస్టేక్ చేస్తే ఆటో సీజ్‌తో పాటు లైసెన్స్ రద్దు
నగరంలో రహదారి భద్రత, ప్రయాణికుల ప్రాణ రక్షణే ధ్యేయంగా అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు గురువారం అరైవ్ అలైవ్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో రహదారి భద్రత, ప్రయాణికుల ప్రాణ రక్షణే ధ్యేయంగా అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు గురువారం అరైవ్ అలైవ్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. కేవలం జరిమానాలు విధించడానికే పరిమితం కాకుండా.. ఆటో డ్రైవర్లలో ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన, క్రమశిక్షణ పెంచేలా ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సురక్షిత ప్రయాణానికి డ్రైవర్ల కంటిచూపు అత్యంత కీలకమైన నేపథ్యంలో.. అబిడ్స్ లోని ప్రముఖ నియో రెటీనా హాస్పిటల్ వైద్య బృందంతో కలిసి అక్కడికక్కడే ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తగిన వైద్య సలహాలు అందించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆటో డ్రైవర్లు కచ్చితంగా మోటార్ వాహనాల చట్టాన్ని పాటించి తీరాలని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఆటో డ్రైవర్ విధిగా ఖాకీ యూనిఫాం ధరించడంతో పాటు.. ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ , ఇన్సూరెన్స్, పొల్యూషన్ పత్రాలను ఎల్లప్పుడూ తమ వెంటే ఉంచుకోవాలని సూచించారు.
లాభాల కోసం ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా, ముఖ్యంగా డ్రైవర్ సీటుకు ఇరువైపులా జనాలను కూర్చోబెట్టుకున్నా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి ఆటో నడిపితే జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని, వెంటనే ఆటోను సీజ్ చేయడంతో పాటు సదరు డ్రైవర్ లైసెన్స్ ను శాశ్వతంగా రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. రహదారులపై అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, ఇష్టానుసారంగా జిగ్-జాగ్ డ్రైవింగ్ చేస్తూ ఇతరులను భయభ్రాంతులకు గురిచేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రయాణికులను ఎక్కించుకోవాలన్నా, దించాలన్నా.. రోడ్డు మధ్యలో కాకుండా ఆటోల కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్టాండ్లలో లేదా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే ఆపాలని సూచించారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడమే డ్రైవర్ల ప్రథమ కర్తవ్యంగా భావించాలని హితవు పలికారు.






