రావణ దహనానికి రూ.6.80 లక్షలు చెల్లించిన గిరిజన నేత

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-10-24 14:43:24  IST  )

దసరా అంటే జమ్మి చెట్టు, పాలపిట్ట, రావణ దహనం.

రావణ దహనానికి రూ.6.80 లక్షలు చెల్లించిన గిరిజన నేత
X

దిశ, దేవరకొండ : దసరా అంటే జమ్మి చెట్టు, పాలపిట్ట, రావణ దహనం. ప్రతి ఊరూవాడ ఈ పండుగను ఎంతో ఉత్సహంతో జరుపుకుంటారు. ఇదే మాదిరిగా నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోనూ ఘనంగా నిర్వహించారు. అయితే ఈ పట్టణంలో గత కొన్నాళ్లుగా ఓ ఆచారం కొనసాగుతోంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకూ ఇక్కడ దసరా స్పెషల్ ఏంటంటే..

ప్రతి గ్రామంలో రావణ దహనాన్ని గ్రామ పెద్దో, సర్పంచో.. ఇతర ప్రజాపతినిధో చేస్తారు. కానీ దేవరకొండ పట్టణంలో ప్రతి విజయదశమి రోజు రావణ దహనం కోసం వేలంపాటలు నిర్వహిస్తారు. వేలం పాటలో గెలిచిన వ్యక్తే రావణ దహనం చేస్తారు. గత పదేళ్లుగా ఇక్కడ ఈ తంతు నిర్వహిస్తున్నారు. నిన్న జరిగిన దసరా వేడుకల్లో యథావిధిగా వేలం పాట నిర్వహించారు. ఈ పాటను అఖిల భారత కాంగ్రెస్ ఆదివాసీ జాతీయ కో-ఆర్డినేటర్, టీపీసీసీ సభ్యుడు నేనావత్ కిషన్ నాయక్ దక్కించుకున్నారు. రావణ దహనానికి ఆయన ఏకంగా 6 లక్షల 80 వేల 116 రూపాయలు చెల్లించారు. కిషన్ నాయక్‌కు ఇదే మొదటి పాట కాదు. ఆరోసారి ఈ వేలంపాటను దక్కించుకున్నారు. కాగా, కిషన్ నాయక్‌ ఆరేళ్లుగా రావణ దహనాన్ని చేస్తున్నట్లు రావణ దహన కార్యక్రమం నిర్వహణ కమిటీ అధ్యక్షుడు పగిడిమర్రి రఘురాములు తెలిపారు.

ఒకే వేదికను పంచుకున్న రాజకీయ ప్రత్యర్థులు

దేవరకొండ పట్టణంలో విజయదశమి (దసరా) పండుగను పట్టణ ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. సోమవారం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో దసరా జమ్మి, శమీ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, బీఎస్పీ, బీజేపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రామావత్ వెంకటేష్ చౌహన్, కేతావత్ లాలూనాయక్ హాజరయ్యారు. వీరంతా అక్కడ ఒకే వేదికను పంచుకొని పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, ఎంపీపీ నల్లగాస్ జాన్ యాదవ్, రైతుబంధు అధ్యక్షుడు శిరందాస్ కృష్ణయ్య, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Next Story