'అమ్మ కోసం ఒక చెట్టు'.. వన మహోత్సవానికి వేళాయే

by Yella Dhawani Reddy |

తెలంగాణలో పచ్చదనం పెంపే లక్ష్యంగా వన మహోత్సవం నిర్వహణకు అటవీ శాఖ సన్నద్ధమవుతోంది.

అమ్మ కోసం ఒక చెట్టు.. వన మహోత్సవానికి వేళాయే
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో పచ్చదనం పెంపే లక్ష్యంగా వన మహోత్సవం నిర్వహణకు అటవీ శాఖ సన్నద్ధమవుతోంది.2025–26 ఏడాది రాష్ట్రంలో 18.03 కోట్ల మొక్కలు నాటాలని భావిస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వం శాఖల వారీగా లక్ష్యాన్ని ఖరారు చేసింది. వాటిలో ఏడు కోట్ల మొక్కలు నాటే బాధ్యతను పంచాయతీ‌రాజ్ శాఖకు అప్పగించింది. ఈసారి పాఠశాల విద్యార్థులను సైతం వన మహోత్సవంలో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'అమ్మ కోసం ఒక చెట్టు'తో కలిపి వన మహోత్సం కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.

వన మహోత్సవంపై సమీక్ష

వన మహోత్స కార్యక్రమంపై వివిధ శాఖాధికారులు ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ అంతా మొక్కలు నాటే విధానంపై చర్చించారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీం, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్తోపాటు పంచా‌యతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ బి.షఫీయుల్లా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

లక్ష్య సాధనకు ప్రణాళికలు

2024 ఏడాది వనమహోత్సవ కింద 20.02 కోట్ల మొక్కలు నాటాలనే నిర్ణయించారు. అయితే 18.66 కోట్ల (93 శాతం లక్ష్యం పూర్తి) మొక్కలు నాటినట్టు అటవీ అధికారులు వివరించారు. గత ఏడాది నాటిన మొక్కల స్థితిగతులపైన సమీక్షించిన తర్వాత ఈ ఏడాది వర్ష కాలంలో 18.03 కోట్ల మొక్కలు, వచ్చే ఏడాది 16.06 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతోపాటు వివిధ శాఖల అధికారులు మొక్కలు నాటేందుకు ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.

కాంగ్రెస్ హయాంలో రెండో వన మహోత్సవం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం​ కొలువుదీరిన తరువాత ఈ ఏడాది జరిగే వన మహోత్సవం రెండోదని చెప్పాలి. ఈసారి స్కూల్ విద్యార్థులను వన మహోత్సవంలో భాగస్వామ్యం చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. తెలంగాణ పచ్చదనంపైన, వనమహోత్సవంపైన ఇప్పటికే అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టి సారించారు.

Next Story