- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవినీతి జలగలకు వల..గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి !
అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. హోదాతో సంబంధం లేకుండా అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులను ఏరివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సదరు అధికారులకు సొంత పార్టీ నేతల అండదండలున్నా పట్టించుకోవద్దని, రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఇటీవల రోడ్డు భవనాల శాఖ ఈఎన్సీ(ఇంజినీరింగ్ ఇన్ చీఫ్) మోహన్ నాయక్ ఇంటిపై అవినీతి నిరోధకశాఖ సోదాలు నిర్వహించినట్టు స్పష్టమవుతున్నది.
మోహన్ నాయక్ పై వరుస ఫిర్యాదులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ నాయక్ ను ఆర్అండ్ బీ ఈఎన్సీగా నియమించింది. కీలకమైన బాధ్యతలు అప్పగించినందుకు జాగ్రత్తగా పనిచేసుకోవాల్సిన ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మించిన పలు రోడ్ల నిర్మాణాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. కొందరు కాంట్రాక్టర్ల వద్ద పెద్దఎత్తున డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. మరోవైపు ఆయన తన వద్దకు వచ్చే ప్రతి ఫైల్ కు ఓ రేటు ఫిక్స్ చేసి డబ్బులు ఇచ్చిన తర్వాతే ఫైల్ పై సంతకం చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విసిగివేసారిన బాధితులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ‘కొడంగల్ నియోజకవర్గంలో నిర్మించిన పలు రోడ్ల పనులకు బిల్లింగ్ చేసేందుకు కాంట్రాక్టర్లను పెద్దఎత్తున మామూళ్లు అడిగారు. ఈ విషయాన్ని సీఎం సన్నిహితులకు దృష్టికి తీసుకెళ్లారు. సమయం చూసుకుని ఏసీబీ రంగంలోకి దింపారు.’ అని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే వివరించారు. హ్యామ్ రోడ్ల టెండర్ల వివాదం వెనక సైతం మోహన్ నాయక్ పాత్ర ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
నిఘావర్గాల పక్కా సమాచారం
అధికారంతో అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల జాబితా ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలిసింది. ఏ శాఖలో ఏ అధికారి పవర్ ను అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారనే విషయంపై నిఘా వర్గాలు సర్కారుకు రిపోర్టు ఇచ్చినట్టు సమాచారం. మండలం నుంచి మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు అధికారుల కదలికలను నివేదికలో చేర్చినట్లు సమాచారం. దీంతో త్వరలోనే మరికొందరు అధికారుల ఇళ్లకు ఏసీబీ వెళ్లి సోదాలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్, ట్రాన్స్ పోర్టు, రిజిస్ట్రేషన్, మెడికల్ విభాగాలకు చెందిన కీలక అధికారులు ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ డిపార్ట్ మెంట్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లు నిఘా వర్గాలు గుర్తించినట్లు తెలిసింది.






