- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డికి ఘన వీడ్కోలు.. సేవలకు పోలీసు యంత్రాంగం నీరాజనం
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ గా సుదీర్ఘకాలం విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన బి. శివధర్ రెడ్డికి పోలీసు యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికింది.

దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ గా సుదీర్ఘకాలం విశేష సేవలందించి పదవీ విరమణ పొందిన బి. శివధర్ రెడ్డికి పోలీసు యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికింది. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ మైదానంలో ఆయన గౌరవార్థం ఫేర్‌వెల్ పెరేడ్ వైభవంగా జరిగింది. టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్త్ పర్యవేక్షణలో, ఐపీఎస్ అధికారి మనన్ భట్ కమాండర్‌గా వ్యవహరించిన ఈ కవాతులో తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లకు చెందిన బలగాలు, మౌంటెడ్ కంపెనీలతో కలిపి మొత్తం 10 కంటింజెంట్లు పాల్గొన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, ట్రైనీలు, కుటుంబ సభ్యుల సమక్షంలో కార్యక్రమం జరిగింది..
ఈ సందర్బంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు నక్సలిజం ఉదృతి తీవ్రంగా ఉన్న రోజుల నుంచి నేటి టెక్నాలజీ ఆధారిత నేరాల వరకు పోలీసు వ్యవస్థ ఎదుర్కొన్న సవాళ్లను ఆయన ప్రస్తావించారు. విశాఖపట్నం, నల్గొండ వంటి జిల్లాల్లో పనిచేసిన సమయంలో మావోయిస్టుల ఏరివేతలో ఇంటెలిజెన్స్, క్షేత్రస్థాయి ఆపరేషన్లను సమన్వయం చేయడంలో తాను పొందిన అనుభవాలను పంచుకున్నారు. ఒకప్పుడు కేవలం శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్‌ఫోర్స్‌మెంట్ కే పరిమితమైన పోలీసు వ్యవస్థ, నేడు ప్రజల నమ్మకాన్ని చూరగొనేలా సిటిజన్ ఫ్రెండ్లీగా మారిందన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, సైబర్ నేరాల దర్యాప్తు కోసం అత్యాధునిక ఫోరెన్సిక్ ల్యాబ్స్, హాక్ ఐ యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ తెలంగాణ పోలీసులు దేశంలోనే ఆదర్శంగా నిలిచారని స్పష్టం చేశారు. నేరాలను జరిగాక పట్టుకోవడం కంటే, ముందస్తుగానే పసిగట్టి నిరోధించే స్థాయికి వ్యవస్థ ఎదగడం గర్వకారణమన్నారు. యువ అధికారులు నిజాయితీగా, చిత్తశుద్ధితో, సానుభూతితో ప్రజలకు సేవ చేస్తూ తమ బృందాలకు అండగా నిలవాలని ఆయన అన్నారు.
తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సి.వి. ఆనంద్ ఈ వేడుకలో మాట్లాడుతూ.. శివధర్ రెడ్డి సేవలను, ఆయన మార్గదర్శకత్వాన్ని వేనోళ్లా కొనియాడారు. రాష్ట్ర పోలీసు బాస్‌గా బాధ్యతలు స్వీకరించడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. 80, 90వ దశకాల్లో రాష్ట్రం ఎదుర్కొన్న నక్సలిజం సవాళ్లను సీవీ ఆనంద్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో గ్రేహౌండ్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ వంటి ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయడం వల్లే నక్సల్స్ మహమ్మారిని సమర్థవంతంగా అరికట్టగలిగామని ఆయన స్పష్టం చేశారు. ఏపీ,తెలంగాణ మోడల్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆ ఆపరేషన్స్ విధానంలో శివధర్ రెడ్డి పాత్ర ఎంతో కీలకమైనదని ప్రశంసించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల స్వభావం మారిందని, భవిష్యత్తులో సైబర్ నేరాలు, డ్రగ్స్ ముప్పు సమాజానికి అత్యంత తీవ్రమైన సవాలుగా మారనున్నాయని నూతన డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. ఈ నయా నేరాలపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వృత్తి నైపుణ్యం, ఆవిష్కరణలు, ప్రజా కేంద్రీకృత పోలీసింగ్‌లో తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉందని, ఆ ఖ్యాతిని మరింత శిఖరాలకు తీసుకెళ్లేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చట్టాల అమలు, సాంకేతికత అనుసంధానం, ప్రజలతో మమేకం కావడం ద్వారా శాంతిభద్రతలను పటిష్ఠంగా కాపాడతామన్నారు. పోలీసు సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని వెల్లడించారు. ప్రతి అధికారి అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కవాతు బలగాల త్రీ చియర్స్ నడుమ, ఉన్నతాధికారుల ఆత్మీయ ఆలింగనాలతో డీజీపీ శివధర్ రెడ్డికి ఘనమైన వీడ్కోలు తెలిపారు.






