- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య.. రూ. 1400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా!
కొండాపూర్‌లో 7 ఎకరాల మేర ఉన్న పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను హైడ్రా శనివారం కాపాడింది. విలువ రూ. 1400 కోట్ల వరకూ ఉంటుందని హైడ్రా అంచనా.

దిశ, డైనమిక్ బ్యూరో: కొండాపూర్‌లో 7 ఎకరాల మేర ఉన్న పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను హైడ్రా శనివారం కాపాడింది. వీటి విలువ రూ. 1400 కోట్ల వరకూ ఉంటుందని హైడ్రా అధికారులు అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ విలేజ్‌లోని సర్వే నంబరు 78 నుంచి 93 లో రాజరాజేశ్వరి నగర్ కాలనీ పేరుతో 2059 ప్లాట్లతో 1993లో గ్రామపంచాయతీ లే ఔట్ వేశారు. అయితే, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 5 ఎకరాలు కేటాయించారు. అలాగే పాఠశాలకు దాదాపు ఎకరా స్థలం,పార్కుల కోసం ఎకరాకు పైగా కేటాయించారు. పాఠశాలకు కేటాయించిన స్థలంలో 1000 గజాల మేర అపార్టుమెంట్‌ను నిర్మించేశారు. కమ్యూనిటీ హాల్ కోసం 2181 గజాలను కేటాయించారు. ఇలా కేటాయించిన భూములు ఆక్రమణలకు గురౌతున్నాయని, వెంటనే కాపాడి రాజరాజేశ్వరి నగర్‌లో నివాసం ఉంటున్న 5 వేల కుటుంబాలకు ఉపయోగపడేలా చూడాలని హైడ్రా ప్రజావాణిలో కాలనీ సంక్షేమ సంఘం కోరింది. ఈ భూముల ఆక్రమణల వెనుక బడాబాబులున్నారని ఫిర్యాదు చేసింది. పలు షోరూంలతో పాటు.. కిరాణా జనరల్ స్టోర్‌లు వచ్చాయని.. రహదారులు కూడా ఆక్రమణలకు గురౌతున్నాయని ఫిర్యాదులో పేర్కొంది.
దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య..
యూఎల్సీ భూములలోని లే ఔట్ లో ప్లాట్లు ఎల్ఆర్ఎస్ అయ్యాయని, పార్కులు, ప్రజావసరాల స్థలాలు ఎల్ఆర్ఎస్ అవ్వకుండా ఆక్రమణదారుల సొంతం ఎలా అవుతాయని ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. అవి పార్కులాగాను ప్రజావసరాల స్థలాల గానే ఉపయోగపడాలని హైడ్రాను కోరారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. లే ఔట్ ప్రకారం పార్కుతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలుగా నిర్ధారించుకుంది. పార్కు స్థలంలో ఇప్పటికే వెయ్యి గజాల మేర అపార్టుమెంట్ రాగా.. కమ్యూనిటీ స్థలంలో పైవేటు షాపులు, షెడ్డులు వేసినట్టు గుర్తించింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు.. అక్కడి నివాసితులకే చెందాలనే ఉద్దేశంతో ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో రాజరాజేశ్వరి నగర్ నివాసితులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య హైడ్రాతో పరిష్కారం అయ్యిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.






