ప్రియుడితో కలిసి భర్తను చంపి పూడ్చిపెట్టిన నర్స్.. 9 రోజుల తర్వాత గుట్టు రట్టు

by Prasad Jukanti |   (  Updated:2026-05-24 09:59:41  IST  )

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపి, జేసీబీతో పూడ్చిపెట్టిన కిరాతక భార్య బాగోతం వెలుగు చూసింది.

ప్రియుడితో కలిసి భర్తను చంపి పూడ్చిపెట్టిన నర్స్.. 9 రోజుల తర్వాత గుట్టు రట్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి భర్తను ఓ భార్య చంపేసి పూడ్చిపెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘోరం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్‍లో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ముత్యం రెడ్డికి కల్పన అనే మహిళతో వివాహం జరిగింది. కల్పన నారాయణఖేడ్‍లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్ గా పని చేస్తోంది. అయితే కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి కాపురంలోకి మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు. కొన్నాళ్లుగా కల్పనకు చింటూ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్త ముత్యంరెడ్డిని అడ్డుతొలగించుకోవాలని భావించిన కల్పన తన ప్రియుడితో కలిసి కంత్రీ ప్లాన్ వేసింది.

జేసీబీ పూడ్చి నాటకం:

ప్రియుడు చింటూతో కలిసి తన భర్తను చంపేసిన కల్పన అనంతరం ఆ మృతదేహాన్ని గ్రామ శివారులో జేసీబీ సహాయంతో గొయ్యి తీసి అందులో పూడ్చిపెట్టింది. ఆ తర్వాత తనకు ఏమీ తెలియనట్లుగా వచ్చి తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు కల్పనపై అనుమానం కలిగింది. దీంతో ఆ దిశగా విచారించగా కల్పన ఆడిన నాటకం బట్టబయలైంది. హత్య జరిగి పూడ్చి పెట్టిన 9 రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీశారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నారాయణఖేడ్ పోలీసులు తెలిపారు. కాగా పరాయి సుఖం కోసం కట్టుకున్నోడ్ని కడతేర్చిన భార్య చివరకు కటకటాల పాలైంది.

Next Story