అధికార పార్టీ నేతల్లో నయా జోష్.. మేజర్ సీట్లు గెలుస్తామని ధీమా

by Kema Shiva Kumar |

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీకి కావాల్సినంత మైలేజ్ తీసుకొస్తున్నారు.

అధికార పార్టీ నేతల్లో నయా జోష్.. మేజర్ సీట్లు గెలుస్తామని ధీమా
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నది. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీకి కావాల్సినంత మైలేజ్ తీసుకొస్తున్నారు. దీనికి తోడు ఇటీవల టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం నిజామాబాద్‌ జిల్లాలో ప్రచారంలో పాల్గొంటూనే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని సమన్వయ పరుస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గాలలో మంత్రులు చైర్మన్లుగా స్క్రీనింగ్ కమిటీలను నియమించారు. కార్పోరేషన్లు, మున్సిపాలిటీలకు కో-ఆర్డినేటర్లను నియమించారు. మీడియా కమిటీ, మానిటరింగ్ కమిటీల జాబితాలను విడుదల చేశారు. వీరంతా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ స్థానిక నేతలను సమన్వయ పరుస్తున్నారు. వీరితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ల చైర్మన్లు క్షేత్ర స్థాయిలో పాదయాత్రలు, పర్యటనలు చేస్తూ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇక పార్టీ పరంగా ఎప్పటికప్పుడు సీఎం, టీపీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్‌లు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తూ నేతలను సమన్వయం చేస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇవన్నీ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలు కాగా, ఎన్నికల అనంతరం పరిణామాలను సైతం అధికార పార్టీ అంచనా వేస్తోంది. పార్టీ అనుకున్నంత మేర ఏదైనా స్థానంలో సీట్లు గెలవకపోతే చైర్మన్ లేదా మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

దక్షిణ తెలంగాణపై ధీమా..

దక్షిణ తెలంగాణలో మూడు కార్పోరేషన్లు ఉండగా నల్లగొండ, మహాబూబ్ నగర్‌లో తాము మంచి మెజార్టీతో సీట్లు సాధిస్తామని హాస్తం నేతలు చెప్తున్నారు. కాగా, కొత్తగూడెం కార్పోరేషన్‌లో రాజకీయ పోరు ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ మిత్ర పక్షం సీపీఐతో ఆ పార్టీకి పొత్తు కుదరలేదు. దీంతో ఏ పార్టీకి మెజార్టీ వస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఎన్నికల అనంతరం ఏదైనా ఒక పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందా? లేక పొత్తులు పెట్టుకుంటుందా? అనేది రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తమ పార్టీకే ఎక్కవ అవకాశాలున్నాయని కాంగ్రెస్ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ ఎన్నికల అనంతరమే రాజకీయం ఎక్కవగా ఉంటుందన్న టాక్ నడుస్తోంది.

ఉత్తర తెలంగాణలో సమాలోచనలు

ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో రాజకీయ వాతావరణం భిన్నంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఉత్తరాన బీజేపీతో ప్రధాన పోటీని ఎదుర్కొంటుండగా, దక్షిణాన బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఉత్తర తెలంగాణలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఇక్కడ నాలుగు కార్పోరేషన్లు నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల, రామగుండం ఉన్నాయి. నిజమాబాద్ కార్పోరేషన్‌లో కాంగ్రెస్, బీజేపీకి మధ్య పోటీ ఉందని, ప్రస్తుతం ఫలితాలపై స్పష్టత కనిపించడం లేదని కాంగ్రెస్‌కు పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చినా ఫలితాల అనంతరం ఇంకో పార్టీతో కలిస్తేనే మేయర్ పీఠం కైవసం చేసుకునే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కరీంనగర్ కార్పోరేషన్‌లోనూ కాంగ్రెస్ బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని, ఇక్కడ సైతం మేయర్ పీఠంపై పాగా వేయాలంటే ఒక పార్టీ మరో పార్టీతో జతకట్టే పరిస్థితి రావొచ్చన్న టాక్ వినిపిస్తోంది. రామగుండం, మంచిర్యాలలో తమ పార్టీకే అత్యధిక సీట్లు వస్తాయని, మేయర్ పీఠం తమకే వస్తుందన్న ధీమాలో కాంగ్రెస్ నేతలున్నారు.

Next Story