తెలంగాణ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. రాజకీయాల్లోకి జీవన్ రెడ్డి కోడలు చరిష్మారెడ్డి!

by Prasad Jukanti |   (  Updated:2026-03-31 12:02:43  IST  )

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ల లెక్కలు మారుతున్నాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

తెలంగాణ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. రాజకీయాల్లోకి జీవన్ రెడ్డి కోడలు చరిష్మారెడ్డి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పాలిటిక్స్ క్రమంగా ఊపందుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటై 27 నెలలు గడుస్తోంది. ఈ ప్రభుత్వానికి అధికారం మరో రెండున్నరేళ్లు మిగిలి ఉండగానే రాబోయే ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. మరోసారి అధికారం తమదేనంటూ రేవంత్ రెడ్డి పదే పదే చెబుతుంటే, మళ్లీ మిమ్మల్ని రానిచ్చేది లేదంటూ విపక్షాలు స్కెచ్చులు వేస్తున్నాయి. అయితే పార్టీల మధ్య పోరు ఇలా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి తమ వారసులను బరిలోకి దింపేందుకు నేతలు గ్రౌండ్ వర్క్ పక్కాగా ప్రిపేర్ చేస్తుండటం ఆసక్తిని రేపుతోంది. దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలన్నట్లు అవకాశాలు ఉన్నప్పుడే తమ వారసులకు బెర్త్ లను సెట్ చేసేందుకు సీనియర్ నేతలు స్కెచ్‍లు వేస్తున్నారు.

రాజకీయాల్లోకి జీవన్ రెడ్డి కోడలు!:

అధికార కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి విషయంలో ఓ ఆసక్తికర చర్చ తెరమీదకు వచ్చింది. త్వరలో జీవన్ రెడ్డి కోడలు చరిష్మారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు పొలిటికల్ కారిడార్‍లో ప్రచారం జరుగుతోంది. కోడలిని బరిలోకి దింపడానికి పెద్దాయన గ్రౌండ్ రెడీ చేస్తున్నారని ఈ వ్యూహంలో భాగంగానే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారని అక్కడ జీవన్ రెడ్డికి సెక్రటరీ జనరల్ పోస్టు అందుకోనుండగా కోడలికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

భారీగా మార్పులు?:

త్వరలో నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా కోటా బిల్లును కేంద్ర అమలు చేయబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇదే అదునుగా రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా తమ తమ వారసులను బరిలోకి దింపేందుకు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్లు వచ్చే స్థానాలపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో పాటు ముఖ్యనేతలంతా దృష్టి సారించారు. తమకు అనుకూలమైన చోట్ల తమ వారసులను సెట్ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తాము కోరిన విధంగా అవకాశం ఇస్తే సరి లేదా కండువా మార్చేందుకు అన్ని పార్టీలలోని ఆశావహ నేతలు ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎవరు ఎటువైపు?:

రాష్ట్ర రాజకీయాలు ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అనేలా సాగబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్,బీజేపీ మధ్య బిగ్ ఫైట్ కొనసాగనుండగా కొత్తగా కల్వకుంట్ల కవిత పార్టీని స్థాపించబోతున్నారు. వచ్చేనెలలోనే ఆమె తన పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు. దీంతో అవకాశాలు దక్కకపోతే చివరి వరకు పార్టీ కోసం నిలబడతారా అనేది సందేహంగా మారింది. దీంతో కొత్త పార్టీలు, మహిళా కోటాతో ఎన్నికల నాటికి ఎవరు ఎటువైపు ఉంటారనేది వేచి చూడాలి.

Next Story