- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిట్యాల మున్సిపాలిటీలో నయా సెన్సేషన్.. ట్రాన్స్‌జెండర్ అద్భుత విజయం
నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర నమోదైంది. 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఓ ట్రాన్స్‌జెండర్ ఘన విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సామాజిక మార్పుకు నాంది పలుకుతూ ఓ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి విజయం సాధించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిట్యాల మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 9 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అభ్యర్థులు 2 వార్డుల్లో, ఇండిపెండెంట్ అభ్యర్థి ఓ వార్డులో గెలిచారు.
సరికొత్త చరిత్ర..
అయితే, ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించింది 1వ వార్డు ఫలితమే. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా (Independent) పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ నాగిళ్ల సుధాకర్ 109 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ బలపరిచిన సీపీఎం అభ్యర్థి జిట్ట నగేష్‌పై సంచలన విజయం సాధించారు. రాజకీయ నేపథ్యం, పార్టీల అండదండలు లేకపోయినా ప్రజల మద్దతుతో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి ట్రాన్స్‌జెండర్ సుధాకర్ జయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఓటు వేసిన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డు అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.






