అభివృద్ధి నమునా.. ప్రధాని రేసులో మరో నేత! కేసీఆర్ స్టాండ్ ఏంటీ?

by Disha Web Desk 4 |
అభివృద్ధి నమునా.. ప్రధాని రేసులో మరో నేత! కేసీఆర్ స్టాండ్ ఏంటీ?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాల్లో కొత్త డిమాండ్‌లు తెరపైకి వస్తున్నాయి. ప్రధాని రేసులో మా నేత ముందున్నాడంటే మా నేత ముందున్నాడు అంటూ ఆయా పార్టీల నేతలు ఇచ్చే స్టేట్‌మెంట్‌లతో విపక్షాల ఐక్యతపై నీలినీడలు కమ్ముతున్నాయి. ఎవరికీ వారే తమ అభివృద్ధి నమునాను దేశ వ్యాప్తంగా అమలు పరుస్తామంటుంటే వీరంతా కలిసి ఎలా ముందుకు వెళ్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

తెలంగాణ అభివృద్ధి నమునాను దేశమంతా విస్తరిస్తామని ఓ వైపు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అంటున్నారు. కాబోయే ప్రధాని కేసీఆర్ అంటూ ఆ పార్టీ నేతలు తరచూ కామెంట్ చేయడం చూస్తూనే ఉన్నాం. తొలుత కాంగ్రేసేతర కూటమి మాత్రమే బీజేపీకి ప్రత్యామ్నాయమన్న సీఎం కేసీఆర్ తర్వాత తానే రంగంలోకి దిగారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి ప్రధాని మోడీకి తానే ప్రత్యామ్నాయం అంటూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. కాగా ఇందుకు భిన్నంగా ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు సాగుతున్నాయి.

ఇప్పటివరకు ప్రధాని రేసులో మొదటి నుంచి వినిపిస్తున్న బీహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్లు ఉండగా తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ పేరు ఆ జాబితాలోకి వచ్చి చేరింది. కాంగ్రెస్ నుంచి ప్రధానిగా రాహుల్ గాంధీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇటీవల స్టాలిన్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకుడు ఫరూఖ్ అబ్ధుల్లా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జాతీయ రాజకీయాల్లో స్టాలిన్ కీ రోల్ పోషించాలని జన్మదిన వేడుకలకు హాజరైన అఖిలేష్ యాదవ్ అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని ప్రధాన పార్టీలు ఒకే తాటిపైకి రావాలని తేజస్వీయాదవ్ కాంక్షించారు.

విపక్షాలన్నీ జట్టు కట్టేనా?

అప్రతిహసంగా కొనసాగుతున్న బీజేపీ జైత్రయాత్రకు అడ్డుకట్ట వేయాలని విపక్షాలన్నీ భావిస్తున్నా బీజేపీ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించింది. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల్లో ఎన్నికల్లో త్రిపుర, నాగాలాండ్‌లో సత్తా చాటి అధికారాన్ని బీజేపీ నిలుపుకుంది. కాగా మేఘాలయ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కాంగ్రెస్ పార్టీయేతర కూటమితో బీజేపీని ఎదుర్కోవడం అసాధ్యమని స్టాలిన్ ఇటీవల వ్యాఖ్యనించారు. రాజకీయ విశ్లేషకులు సైతం కాంగ్రెస్ లేకుండా విపక్షాలకు అధికారం సాధ్యం కాదని అంటున్నారు. విపక్షాలన్నీ ఒక తాటికి రావాలని కాంక్షిస్తున్న నేతలు సాధ్యాసాధ్యాలను తర్కించుకుని ముందుకు సాగితే మరింత ఫలితాలు సాధించే అవకాశం ఉంది. తమిళనాడులో సైతం బీజేపీ చాపకింద నీరులా తమ వ్యుహాలను అమలు చేస్తోంది. కమ్యూనిస్టుల కంచుకోట త్రిపురలో వరుసగా రెండో సారి బీజేపీ అధికారంలోకి రావడాన్ని మాత్రం తక్కువ చేసి చూడలేమని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

అభివృద్ధి నమునా అంటూ..

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తమ అభివృద్ధి నమునాను దేశమంతా విస్తరిస్తామని చెబుతుండగా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గతంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని కావాలంటూ కాంక్షించారు. తాజాగా తమిళనాడులో ఇదే అంశం తెరపైకి వచ్చింది. కేసీఆర్ సైతం తెలంగాణ మోడల్ అని తన ప్రతి ప్రసంగంలో చెబుతూ వస్తున్నారు. మరి ఇన్ని పార్టీలు ఒక తాటిపై నిలవడం సాధ్యమేనా అంటే మాత్రం అంతుచిక్కని ప్రశ్నే అని చెప్పొచ్చు.

ఎన్నికల ముందే ఇన్ని కొత్త కొత్త డిమాండ్‌లు రావడంతో ఎన్నికల అనంతరం ఇంకేం జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది. అయితే తెలంగాణ నూతన సచివాలయానికి ఇప్పటికే స్టాలిన్‌కు సీఎం కేసీఆర్ ఆహ్వానం పలికిన దరిమిలా మరి తాజా డిమాండ్‌తో కేసీఆర్ స్టాండ్ ఏంటనేది తేలాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ నోటి వెంట ఇతర వ్యక్తులు ప్రధాని కావాలి అని మాత్రం వినిపించలేదు.

తానే ముందుండి నడపాలని భావిస్తున్న గులాబీ బాస్ మరి ద్రవిడ అభివృద్ధి నమునా గురించి ఎలా స్పందిస్తారు. ఉత్తరాది నుంచి కాకుండా దక్షిణాది నుంచి ప్రధానమంత్రి అనే డిమాండ్ వినిపిస్తున్న వేళ కేసీఆర్ నిర్ణయం ఎలా ఉండనుందనే ఆసక్తి నెలకొంది. ప్రధాని అంశంలో విపక్షాలు క్లారిటీకి వస్తేనే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొవచ్చని, ఉమ్మడి పోరులో నేతలంతా కలిసి వస్తేనే విజయం సాధ్యమనే అభిప్రాయం ఉంది. మోడీ - అమిత్ షా ద్వయం వ్యుహాలను మరి ప్రాంతీయ పార్టీలు ఎలా చేధిస్తాయి. వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీ దూకుడును విపక్షాలు ఎలా ఎదుర్కొంటాయనేది పొలిటికల్ సర్కిల్స్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది.



Next Story