మహిళా పోరాటాలకు నాంది.. కదం తొక్కిన ఐద్వా దండు.. నగరంలో భారీ ర్యాలీ

by Ramesh Naini |

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభను పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లో మహిళాలోకం దండుగా కదిలింది.

మహిళా పోరాటాలకు నాంది.. కదం తొక్కిన ఐద్వా దండు.. నగరంలో భారీ ర్యాలీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభను పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లో మహిళాలోకం దండుగా కదిలింది. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్‌వీకే) నుంచి నారాయణగూడ ఫ్లైఓవర్‌, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు మీదుగా బస్‌ భవన్‌ పక్కన ఉన్న ఆర్టీసీ గ్రౌండ్‌ వరకు వేలాది మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అగ్రభాగంలో ఐద్వా ప్యాట్రన్‌ బృందా కరత్‌, అఖిల భారత అధ్యక్షురాలు పీకే. శ్రీమతి, ప్రధాన కార్యదర్శి మరియం దావలే, జాతీయ నేతలు సుభాషిణి అలీ, పుణ్యవతి, రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌. అరుణ జ్యోతి, ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళల హక్కుల సాధనకు పోరాటాలే మార్గమని వారు పిలుపునిచ్చారు.

స్టెప్పులు వేస్తూ ఉత్సాహం..

మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ర్యాలీలో పెద్దఎత్తున నినాదాలు మార్మోగాయి. ‘సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి’, ‘మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వాతంత్ర్యం కల్పించాలి’, ‘మనుధర్మం రుద్దడం మానాలి – సమాన హక్కులు ఇవ్వాలి’ అంటూ మహిళలు గర్జించారు. మోడీ సర్కారుకు గట్టి హెచ్చరికలు పంపించారు. ర్యాలీలో భాగంగా పోరాట చైతన్య గీతాలకు నాయకులు, కార్యకర్తలు స్టెప్పులు వేస్తూ ఉత్సాహాన్ని నింపారు. ఐద్వా కార్యకర్తలు ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మల్లు స్వరాజ్యం, మల్లు లక్ష్మి స్వగ్రామమైన రాయినిగూడెం నుంచి తీసుకొచ్చిన బోనాలు ర్యాలీకి సాంస్కృతిక శోభను అద్దాయి. ఈ ధిక్కార స్వరాల ఉద్యమం భవిష్యత్‌ మహిళా పోరాటాలకు నాంది పలుకుతుందని ఐద్వా నేతలు స్పష్టం చేశారు.

Next Story