తెలంగాణలో పెద్ద డ్రామా నడుస్తోంది.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

తెలంగాణలో కాంగ్రెస్, పవన్ కళ్యాణ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా నడుస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.

తెలంగాణలో పెద్ద డ్రామా నడుస్తోంది.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రెస్‌మీట్, సభకు అనుమతి నిరాకరణ వ్యవహారాలపై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్, పవన్ కళ్యాణ్ కలిసి ఓ పెద్ద డ్రామా నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇవాళ జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సభకు ఆంక్షలు పెట్టడం వెనుక కాంగ్రెస్, జనసేనల మధ్య ఉన్న ‘మ్యాచ్ ఫిక్సింగ్’ స్పష్టంగా అర్థమవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న అసలైన ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే ఈ హైడ్రామాకు తెర లేపారని మండిపడ్డారు. పవన్ మాటల్లో ఎక్కడా స్పష్టత లేదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్క్రిప్ట్ రాసిస్తే.. పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చి చదివారంటూ ఎద్దేవా చేశారు. పవన్ అసలు పాకిస్తాన్‌ (Pakistan)లో ఉండాల్సిన వ్యక్తి అంటూ జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇది ఓ పొలిటికల్ స్టంట్‌లా ఉంది..

రాష్ట్రంలో గతంలో అనేక పార్టీలు స్వేచ్ఛగా పోటీ చేశాయని గుర్తుచేసిన జగదీశ్ రెడ్డి.. పవన్ కళ్యాణ్ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే చట్టబద్ధంగా కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాలి కానీ, ఇలా రాజకీయ రచ్చ చేయడం ఏంటని ప్రశ్నించారు. అనుమతి నిరాకరణను ఓ పొలిటికల్ స్టంట్‌లా వాడుకుంటున్నారని జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ అనే పదాన్ని పలికేందుకు కూడా ఇష్టం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ కొత్త పవన్ కళ్యాణ్ వివాదాన్ని వాడుకుంటున్నారని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story