సివిల్ సప్లయీస్‌లో ‘లక్ష’ణమైన దందా.. పైసలిస్తే ఉద్యోగం పక్కా!

by Kema Shiva Kumar |

తెలంగాణ పౌరసరఫరాల శాఖలో జనరల్ మేనేజర్ల పెత్తనం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పొడిగింపునకు వసూళ్ల పర్వంపై కొనసాగుతోంది.

సివిల్ సప్లయీస్‌లో ‘లక్ష’ణమైన దందా.. పైసలిస్తే ఉద్యోగం పక్కా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సివిల్ సప్లయీస్ కమిషనరేట్‌లో బాసులుగా ఐఏఎస్/ఐపీఎస్‌లు ఉన్నా పెత్తనం మాత్రం జనరల్ మేనేజర్లదే అని ప్రచారం జరుగుతున్నది. వారి కనుసన్నల్లోనే పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు విమర్శలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కమిషనర్లను సైతం తప్పుదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జనరల్ మేనేజర్లను ఎక్కువ కాలం అదే పోస్టులో కొనసాగించడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మధ్య అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్‌ను కొనసాగించేందుకు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే పీడీఎస్ బియ్యం సరఫరా కాంట్రాక్టుల్లో ముడుపులు తీసుకుని తమకు అనుకూలమైన వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తున్నది.

పైసలు ఇస్తేనే కొనసాగింపు..

సివిల్ సప్లయీస్ శాఖలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చాలా కీలకమైన విభాగం. ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యం నాణ్యతగా ఉన్నాయా? లేదా? పరిశీలించి సదరు టీమ్ క్లీన్‌చిట్ ఇచ్చిన తర్వాతే బియ్యం రేషన్ దుకాణాలకు వెళ్తాయి. అలాగే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌లోకి తరలకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటారు. ఇంతటి కీలకమైన బాధ్యతల్లో ఉన్న టెక్నికల్ టీమ్ ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండాలి. కానీ ఈ వింగ్‌లో పనిచేస్తున్న మెజార్టీ మంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు. హెడ్ ఆఫీసులో ఉన్న సంబంధాల కారణంగా 70 ఏళ్లు నిండిన రిటైర్డ్ ఉద్యోగులను సైతం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిఏడాది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలంటే ఆర్థిక శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. దీనితో సుమారు 70 మంది రిటైర్డ్ ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ పద్ధతిన కొనసాగించాలంటే ఒక్కొక్కరు రూ.లక్ష ఇవ్వాలని కండీషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. డబ్బులు ఇచ్చిన వారి పేర్లు మాత్రమే లిస్టులో చేర్చి ఆర్థికశాఖ అనుమతి కోసం పంపేందుకు జాబితాను రెడీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆలస్యంగా గుర్తింపు..

గోదాముల నుంచి బియ్యాన్ని రేషన్ డీలర్లకు సరఫరా చేసేందుకు ప్రతి ఏటా టెండర్లను పిలుస్తుంటారు. కొన్నేళ్లుగా ఆ విభాగం బాధ్యతలు చూస్తున్న అధికారులు తమకు తాయిళాలు, ప్రయోజనాలు అందించే ఎజెన్సీలకు కాంట్రాక్టులు అప్పగించేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. అందుకోసం చిన్న చిన్న టెక్నికల్ కారణాలను సాకుగా చూపించి పోటీ ఎజెన్సీల బిడ్స్‌ను డిస్ క్వాలిపై చేయించినట్లు తెలిసింది. దీంతో 24 జిల్లాల్లో సింగిల్ ఎజెన్సీల టెక్నికల్ బిడ్స్ మాత్రమే క్లియర్ అయ్యాయి. టెక్నికల్ బిడ్స్‌లో కేవలం ఒక్కరే మిగిలితే తిరిగి టెండర్లు పిలవాలి. కానీ, హెడ్ ఆఫీసులోని కీలక అధికారులు సదరు ఎజెన్సీలకు కాంట్రాక్టు పనులు అప్పగించే ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఈ విషయం కమిషనర్ దృష్టికి రావడంతో టెండర్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిసింది.

Next Story