- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో కీలకముందడుగు
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో కీలకముందడుగు పడింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో కీలకముందడుగు పడింది. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్(బాపుఘాట్) వరకు 9.2కిలోమీటర్ల పరిధి, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11.8కిలోమీటర్ల పరిధిలో 50 ఎకరాల భూములను సేకరించాలని మూసీ రివర్ ఫ్రంట్ డవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) నిర్ణయించింది. దీనికి సంబంధించి బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది.
55కిలోమీటర్లు..50మీటర్ల బఫర్ ఏరియా
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్కల్-మల్కాజ్ గిరి జిల్లాలోని 14 మండలాల పరిధిలో గండిపేట్ నుంచి గౌరెల్లి వరకు 55కిలోమీటర్ల మార్గంలో మూసీ ప్రవహిస్తోంది. ఈ 55కిలోమీటర్ల మార్గంలో నదికి ఇరువైపుల 50మీటర్ల బఫర్ ఏరియాను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో నది జీవావరణ, అర్బన్ ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మూసీ నది శుద్ధీకరణతో పాటు, ఇరువైపులా పర్యాటక కేంద్రాలు, ఉద్యానవనాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణళికలు రూపొందించింది. భూసేకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో త్వరలోనే క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
21కిలోమీటర్ల పరిధిలో..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు పడింది. ఈ మేరకు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నది పరివాహక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. తొలి విడతలో హైదరాబాద్ జిల్లాలోని గోల్కండ మండలంలోనిఇబ్రహీంబాగ్, ఖిల్లా మొహ్మద్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలోని హైదర్ గుడ, బుద్వేల్, ఉప్పర్ పల్లి, గండిపేట్ మండలంలోని దర్గకాలిష్ ఖాన్, కిస్మత్ పుర, గండిపేట, నార్సింగి, మంచిరేవుల, గంధంగుడ, హైదర్షాకోట్,, బండ్లగుడ గ్రామాల్లోని 50ఎకరాలను భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే నంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితాను అధికారులు ఇప్పటికే ప్రకటించారు. భూములను కోల్పోతున్న యజమానులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా భూ యజమానులకు తగిన నష్టపరిహారాన్ని టీడీఆర్ రూపంలో చెల్లించాలని నిర్ణయించింది. ఈ భూసేకరణపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
టీడీఆర్ రూపంలో పరిహారం
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో భూముల కోల్పోనున్న బాధితులకు ట్రాన్స్ ఫర్ ఆఫ్ డవలప్ మెంట్స్ రైట్స్(టీడీఆర్) రూపంలో పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇప్పటికే జారీచేసిన విషయం తెలిసిందే. అయితే చెరువుల ఎఫ్టీఎల్, నదుల ఎంఎఫ్ఎల్ పరిధిలోకొచ్చే భూములను సరెండర్ చేస్తే వాటికి 200శాతం టీడీఆర్, చెరువులు, నదులు బఫర్ జోన్ల పరిధిలోని భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే 300శాతం, బఫర్ జోన్ కు వెలుపల ఉన్న (జలాశయాల పరిరక్షణ, అభివృద్ది, ప్రజాప్రయోజనాల ప్రాజెక్టు కోసం రోడ్లు విస్తరణ పనులు) భూములను సరెండర్ చేస్తే 400శాతం, ప్రయివేటు భూముల్లో నాలాల వెడల్పు పనులు చేపట్టడానికి (రెవెన్యూ రికార్డుల్లో సూచించబడిన నాలాలు) భూములను ఇస్తే వాటికి 400శాతం టీడీఆర్ రూపంలో నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.






