హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వాలి

by velandi.Saikiran |

హై కోర్టు జస్టీస్ అపరేష్ కుమార్ సింగ్ ను శుక్రవారం కలిసి పిటిషన్ అందజేశారు.

హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో షెడ్యూల్డ్ కులానికి (ఎస్సీ)సామాజిక న్యాయం, న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ అడ్వకేట్ అసోసియేషన్ ( మా) భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)తో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంయుక్తంగా పిటిషన్ సమర్పించారు. హై కోర్టు జస్టీస్ అపరేష్ కుమార్ సింగ్ ను శుక్రవారం కలిసి పిటిషన్ అందజేశారు. ఈ సందర్భంగా మా సభ్యులు హైకోర్టు న్యాయవ్యవస్థకు సంబంధించిన చారిత్రక నియామకాల గణాంకాలు తీవ్ర అసమానతలను బయటపెట్టుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. 1952 నుంచి 2015 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 170 న్యాయమూర్తుల నియామకాలలో ఎస్సీ సమాజం నుంచి కేవలం నలుగురు మాత్రమే ధర్మాసనానికి ఎంపికయ్యారని తెలిపారు.

అందులో మాదిగ సమాజం నుంచి ఒక్కరికి కూడా అవకాశం లభించలేదని వెల్లడించారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టులో విభజన తర్వాత జరిగిన 24 నియామకాలలో ఎస్సీ సమాజం నుంచి ఒక్క న్యాయవాది మాత్రమే ధర్మాసనానికి చేరుకున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్డ్ కుల సమాజానికి చెందిన న్యాయవాదులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నట్లు పేర్కోన్నారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన పూర్వ తీర్పులు, అలాగే వివిధ వర్గాలు రాజకీయ పార్టీల మధ్య ఉన్న సమిష్టి ఏకాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని, న్యాయమూర్తుల నియామకాలలో సముచిత ప్రతినిధ్యం కల్పించాలన్నారు. ప్రాధాన్యత కల్పించకపోతే న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. న్యాయవ్యవస్థలో సమానత్వం, సామాజిక న్యాయం నిజంగా అమలవ్వాలంటే, హైకోర్టు బెంచ్‌లో అన్ని వర్గాలకు న్యాయమైన అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని దళిత న్యాయవాదులు స్పష్టం చేశారు.

Next Story