Maoist Party: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. మరో ఇద్దరు కీలక నేతల అరెస్టు

by Prasad Jukanti |   (  Updated:2026-01-24 13:05:27  IST  )

అచ్చంపేటలో మావోయిస్టు పార్టీ కీలక నేతలతో పాటు వారికి సహకరిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.

Maoist Party: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. మరో ఇద్దరు కీలక నేతల అరెస్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో/దిశ, అచ్చంపేట: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, మిలటరీ ఇన్‌స్ట్రక్టర్ టీమ్ కమాండర్ మీసాల సాల్మన్ అలియాస్ సంతోశ్ నాగరాజు, ఆయన సతీమణి డీవీసీఎం, పీఎల్‌జీఏ బెటాలియన్, కంపెనీ-2, ప్లాటూన్-2 సంబట్టిని నాగర్ కర్నూల్ పోలీసులు అరెస్టు చేశారు. అచ్చంపేటకు వచ్చిన వీరు ఇక్కడ మావోయిస్టు ఫ్రంట్ సంస్థల నాయకుల సహాయంతో మావోయిస్టు కార్యకలాపాలను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మహబూబ్‌నగర్, నల్లమల ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తూ, ఆశ్రయం కల్పిస్తున్న మావోయిస్టు అనుబంధ ఫ్రంట్ సంస్థలకు చెందిన మరో ముగ్గురిని సైతం అరెస్టు చేశారు. వీరిలో తెలంగాణ ప్రజాఫ్రంట్ కో-కన్వీనర్ ఎడ్ల అంబయ్య, సివిల్ లిబర్టీస్ కమిటీ జాయింట్ సెక్రటరీ జక్క బాలయ్య, మంశెట్టి యాదయ్య ఉన్నారు. ఇవాళ ఉదయం 11:30 గంటల ప్రాంతంలో మన్ననూరు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఎర్టీగా కారులో ఉన్న వీరిని సీఐ ఏ.నాగరాజు బృందం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారి నుంచి లక్షన్నర నగదు, ఐదు జిలెటిన్‌ స్టిక్స్, పది ఏకే 47 బుల్లెట్స్, 10 లైవ్ రౌండ్ తూటాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

సాల్మాన్ పై రూ.20 లక్షల రివార్డు

గుంటూరు జిల్లా బొల్లపల్లి మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మీసాల సాల్మాన్ 1994లో నల్లమల ప్రాంతంలోని బొల్లపల్లి దళం ద్వారా మావోయిస్టు పార్టీలో చేరారు. నేరుగా సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఆధీనంలో పని చేస్తూ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, హిడ్మా నుంచి వచ్చే ఆదేశాల మేరకు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ప్రయాణిస్తూ కేడర్లకు గెరిల్లా యుద్ధ శిక్షణ అందిస్తున్నారు. ఇప్పటి వరకు పీఎల్ జీఏ బెటాలియన్‌కు చెందిన 200 మందికి పైగా కేడర్లకు, అలాగే వేలాది మంది కేడర్లకు గెలిల్లా వార్ ఫేర్‌లో శిక్షణ ఇచ్చాడు. ఈయనపై రూ.20 లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు.

64 కేసుల్లో ప్రమేయం.. వందలాది మంది పోలీసుల హతం

భద్రతా దళాల శిబిరాలపై దాడులు సహా మొత్తం 64 కేసుల్లో సాల్మాన్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈయన జరిపిన దాడుల్లో వందలాది మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. 1999లో బొల్లపల్లి మండలం రేమిడిచెర్ల సమీపంలో ల్యాండ్ మైన్లు పేల్చి పోలీసు వ్యాన్‌పై జరిపిన దాడిలో 10 పోలీసు సిబ్బంది మృతి చెందారు. 2001లో నర్సారావుపేటలోని ఎస్ఎన్ కాలేజీలో ఉన్న పోలీస్ శిక్షణ శిబిరంపై దాడి జరిపి 25 ఆయుధాలు ఎత్తుకెళ్లారు. 2014 డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని కససల్పాడ్‌లో జరిపిన దాడిలో 14 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. 2020లో మిన్పా గ్రాంలో జరిపిన దాడిలో 17 మంది డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా జవాన్లు, 2021లో జొన్నగూడెం ఎటాక్‌లో 22 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతిలో సాల్మాన్ కీలకంగా వ్యవహరించారు.

Next Story