మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ.. లొంగుబాటుకు సిద్ధమవుతోన్న అగ్రనేతలు?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-21 11:44:32  IST  )

కరెగుట్టల అటవీప్రాంతాల్లో భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోన్న వేళ మావోయిస్టు పార్టీ అగ్రనేతలు లొంగుబాటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ.. లొంగుబాటుకు సిద్ధమవుతోన్న అగ్రనేతలు?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ అటవీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్రెగుట్టల అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు విస్తృతంగా కూంబింగ్ కొనసాగిస్తున్న వేళ.. మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటుకు సిద్ధమయ్యారన్న సమాచారం భద్రతా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. కీలక మావోయిస్టు నాయకులు లొంగుబాటు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో సెంట్రల్ కమిటీ (సీసీ) సభ్యులు, రాష్ట్ర కమిటీ (స్టేట్ కమిటీ) సభ్యులు ఉన్నారని భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఇదే నిజమైతే, దక్షిణ జోన్ కార్యకలాపాలపై గణనీయ ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సరెండర్‌పై ఎస్ఐబీకి సమాచారం?

లొంగుబాటు ప్రక్రియపై మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు యత్నిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస విధానాలు, ఆర్థిక సాయాలు, భద్రతా హామీలు ఈ నిర్ణయానికి దారితీసిన కారణాలుగా భావిస్తున్నారు. సుమారు 25 మంది కీలక మావోయిస్ట్ నాయకులు లొంగుబాటుకు సన్నాహాలపై ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)కు సమాచారం అందినట్లు తెలుస్తోంది. మావోయిస్ట్ అగ్రనేతలు లొంగుబాటుకు ముందుకొస్తే, ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా మారే ప్రమాదముంది. నియామకాలు, ఆర్థిక వనరులు, కార్యకలాపాల సమన్వయంపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టు నేతల లొంగుబాటు అంశంలో అధికారిక ప్రకటన వెలువడే వరకు ఉత్కంఠ కొనసాగనుంది.

అగ్రనేతల కదలికలపై నిఘా..

మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ఆంధ్రా ప్రాంతానికి చెందిన మరో కీలక నేత తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తున్నది. అయితే, ఈ వివరాలపై అధికారిక ధ్రువీకరణ లేదు. భద్రతా దళాలు ఈ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నాయి. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించగా.. అనుమానాస్పద కదలికలను గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. పరిస్థితులు వేగంగా మారే అవకాశాల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నిఘా మరింత బలోపేతం చేశారు.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూంబింగ్..

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో సంయుక్త బలగాలు విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతను మరింత పెంచారు. అటవీ మార్గాలు, పాత క్యాంపుల ఆనవాళ్లు, ఆయుధ నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైతే అదనపు బలగాలను సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్టులు పెంచి, వాహనాల తనిఖీలు కఠినతరం చేశారు. అనుమానాస్పద కదలికలపై డ్రోన్లు, సాంకేతిక పర్యవేక్షణ వ్యవస్థలను వినియోగిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సరిహద్దులో గోదావరి నది తీర ప్రాంతాల్లో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసు దళాలు సంయుక్తంగా పహారా కాస్తున్నాయి. నది దాటే మార్గాలు, అటవీ మార్గాలు, గిరిజన గ్రామాల సమీప ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రాత్రిపూట గస్తీ బలగాలను పెంచి, నైట్ విజన్ పరికరాలతో తనిఖీలు చేస్తున్నారు.

త్వ‌ర‌లోనే దేవ్ జీ, మ‌ల్ల రాజిరెడ్డి అజ్ఞాతం వీడ‌తారు.. మల్లోజుల కీలక వ్యాఖ్యలు

Next Story