- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GHMC ఎన్నికల కోసమే ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ కొత్త నాటకం: రామచందర్ రావు
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తోందని, CURE చట్టంతో పన్నుల భారం మోపుతోందని రామచందర్ రావు విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ కొత్త నాటకానికి తెరలేపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ మంత్రులు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుకు రూ.100, ఈఎండీ పేరుతో రూ.10,000 డిపాజిట్ వసూలు చేస్తున్నారని ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పేరుతో రూ.32 వేల చొప్పున డిపాజిట్లు తీసుకున్న విధానాన్ని గుర్తు చేస్తోందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఇల్లు లేని పేదల కోసమే పథకం అంటూనే, అదే పేదవాడి నుంచి ముందుగా రూ.10,000 తీసుకోవడం అన్యాయం అన్నారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... దరఖాస్తు దారుల నుంచి డబ్బులు తీసుకున్నాక నిజంగా ఇండ్లు ఇస్తారా లేదా అన్నది సందేహమేనని, రాజీవ్ స్వగృహ పేరుతో రాజశేఖర్ రెడ్డి హయాంలో కట్టిన ఇళ్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.
లక్షల్లో అర్హులు వేలలో ప్లాట్లు:
24 నియోజకవర్గాల్లో లక్షల మంది అర్హులు ఉంటే ప్రభుత్వం కేవలం 7,680 ప్లాట్లు మాత్రమే ఇస్తామని చెబుతోందని దరఖాస్తులు చేసుకునేది లక్షల మంది అయితే ఇండ్లు దక్కబోయేది కొద్దిమందికేనన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే నిర్మించిన అనేక పేదల ఇండ్లు ఖాళీగానే ఉన్నాయన్నారు. జవహర్‌నగర్‌లో 20 అంతస్తుల భవనాల్లో వందలాది ఫ్లాట్లు నిర్మించినా ఇప్పటివరకు పేదలకు కేటాయించలేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే నిర్లక్ష్యం కొనసాగిందన్నారు. రాజీవ్ స్వగృహ ఇండ్లపై సీబీసీఐడీ విచారణ చేస్తామని గత ప్రభుత్వం చెప్పినా ఇంతవరకు అమలు కాలేదని పేదలకు ఇళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ సర్కారు అర్హులందరికీ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొద్దిమందికి ఇచ్చి ప్రచారం చేసుకోవడం సరైన విధానం కాదన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తున్న నిధులు, సబ్సిడీలను కూడా ఈ ఇండ్ల నిర్మాణంలో వినియోగించుకుంటున్నారని చెప్పారు.
CURE చట్టంతో ప్రజలపై అదనపు భారం:
కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ కోసం కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) చట్టాన్ని తీసుకొచ్చిందని 1955 చట్టంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్పులు తీసుకొస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ క్యూర్ చట్టంలోని కీలక నిబంధనలపైనే మా అభ్యంతరం ఉందని ఈ విషయాన్ని బీజేపీ అసెంబ్లీలో స్పష్టంగా వెల్లడిస్తామన్నారు. ఈ చట్టంతో పేదలు, మధ్యతరగతి ప్రజలపై ట్యాక్స్ ల భారం పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రజల అభిప్రాయాలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల సూచనలు తీసుకున్న తర్వాతే ఈ చట్టాన్ని తీసుకురావాలన్నారు. ప్రతి సంవత్సరం 5 శాతం వరకు టాక్స్ పెరిగే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా ట్యాక్స్ నిర్ణయించడం సరికాదన్నారు. యూనిఫార్మిటీ లేకుండా ట్యాక్స్ దోపిడీ జరిగే ప్రమాదం ఉందని వాటర్, సివరేజ్ సేవలను విడదీసి వేర్వేరు ట్యాక్సులు విధించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దీంతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఇది సరైన చట్టం కాదని ఈ చట్టంపై ఎవరితోనూ ప్రభుత్వం చర్చించలేదన్నారు.






