- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికార పార్టీలో పదవుల జాతర..! ముఖ్య నేతల గంపెడాశలు
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పదవుల కోలాహాలం మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పదవుల కోలాహలం మొదలైంది. డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం పార్టీ అధినాయకత్వం ఇటీవల 22 మంది పరిశీలకులను నియమించింది. వీరు త్వరలోనే తెలంగాణలో జిల్లాల వారీగా క్షేత్ర స్థాయిలో ఆయా నేతలు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి నివేదించనున్నారు. ఆ తర్వాత డీసీసీ అధ్యక్షుల నియామక ప్రకటనను ఏఐసీసీ చేయనుంది. ఇప్పటికే డీసీసీ కార్యవర్గాల కూర్పు కోసం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆయా జిల్లాల ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు. ప్రతి ఒక్క నేతతో వన్ టు వన్ గా మాట్లాడారని, కార్యవర్గాల కూర్పు కూడా తుది దశకు చేరుకుందని పార్టీ వర్గాలు చెప్పాయి. డీసీసీ అధ్యక్షులు, కార్యవర్గాల నియామక ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేస్తామని ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడిన నేతలకు న్యాయం చేస్తామని, లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే జిల్లా కమిటీలు, జిల్లా పార్టీ చీఫ్ ల ఎంపిక ప్రక్రియ స్పీడ్ అప్ అయిందన్న టాక్ పార్టీ వర్గాల్లో ఉంది.
నామినేటెడ్ పోస్టులపైనా ఆశలు
పార్టీ పరంగా పదవుల భర్తీ ప్రక్రియ మొదలు కావడంతో ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై హస్తం పార్టీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటి నుంచే వారు ప్రయత్నాలను మొదలు పెట్టినట్లుగా సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కావొస్తున్న క్రమంలో దాదాపు 50 దాకా ఉన్న కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవులపై వందల సంఖ్యలో ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు పార్టీ పరంగా భర్తీ చేయాల్సిన అనుబంధ సంఘాలు, ప్రచార కమిటీలు, అధికార ప్రతినిధులు, మీడియా కమిటీ ఇలా అనేక పార్టీ పదవుల్లో నియామకాలు చేపట్టాల్సి ఉన్నది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మరింత బలోపేతం కావాలంటే పార్టీ పరమైన పోస్టులు, నామినేటెడ్ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తే నాయకులు కూడా ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేస్తారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక లోకల్బాడీ ఎన్నికల్లో పోటీకి కూడా హస్తం నేతలు సన్నద్ధమవుతున్నారు. గ్రామస్థాయిల్లో ఇప్పటికే స్థానిక పోరుకు సంబంధించిన హడావిడి మొదలైంది. టికెట్ల కోసం తమ ప్రయత్నాలను ఆశావహులు ముమ్మరం చేశారు. డీసీసీ చీఫ్ ల నియామకం తర్వాత జిల్లాల్లో పార్టీ యాక్టివిటీ మరింత పెరగనున్నది. దీంతో హస్తం పార్టీలో హాడావిడి వేగం పుంజుకోనున్నట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది.






