లక్షల టన్నుల వ్యర్థాలు.. ఐటీ కారిడార్‌లో తొమ్మిదేళ్లుగా గుట్టలుగా పేరుకుపోయిన డంప్

by Ajay Maddhiboyina |

ఐటీ కారిడార్ నడిబొడ్డున భవన నిర్మాణ వ్యర్థాల గుట్ట ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. 2017 నుంచి తొమ్మిదేళ్లుగా 15 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు భారీ గుట్టగా మారాయి.

లక్షల టన్నుల వ్యర్థాలు.. ఐటీ కారిడార్‌లో తొమ్మిదేళ్లుగా గుట్టలుగా పేరుకుపోయిన డంప్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఐటీ కారిడార్ నడిబొడ్డున భవన నిర్మాణ వ్యర్థాల గుట్ట ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. 2017 నుంచి తొమ్మిదేళ్లుగా 15 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు భారీ గుట్టగా మారాయి. వీటిని తొలగించాలంటే భారీ ఖర్చుతోపాటు కాలుష్య సమస్య వచ్చే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు దీనికి సంబంధించిన భూమి ప్రభుత్వానిదా? కాదా? అనే విషయంపై సైతం సందిగ్ధం నెలకొన్నది.

15 లక్షల మెట్రిక్ టన్నుల మట్టి కుప్పలు

గచ్చిబౌలి ఫేజ్-2లోని ఐకియా పక్కన 13 ఎకరాల్లో 15 లక్షల మెట్రిక్ టన్నుల మట్టికుప్పలు పేరుకుపోయాయి. దీన్ని క్లియర్ చేయడానికి ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆ భూమి ఎవరిదని తేల్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2017 నుంచి చుట్టుపక్కల నిర్మించిన భారీ బహుళ అంతస్తుల భవనాలకు చెందిన నిర్మాణరంగ వ్యర్థాలను అక్కడ పడేశారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ లేకపోవడంతో చెత్త పేరుకుపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సీ అండ్ డీ వేస్ట్ ఎక్కడపడితే అక్కడ వేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గొప్పలు చెప్పిన అధికారులు.. 15 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయేవరకు ఏం చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

రూ.90 కోట్ల ఖర్చు

ఐటీ కారిడార్‌లో 13 ఎకరాల్లో పేరుకుపోయిన 15 లక్షల మెట్రిక్ టన్నుల మట్టికుప్పలను తొలగించడానికి సుమారు రూ.90 కోట్లు ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు. ఒక వేళ గుట్టను క్లియర్ చేయాలనుకుంటే రోజుకు ఐదు వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించడానికి ఏడాదిన్నర సమయం పడుతుందని చెబుతున్నారు. దీంతోపాటు దుండిగల్‌లో ఉన్న సీ అండ్ డీ ప్లాంట్‌కు తరలించి సైంటిఫిక్‌గా డిస్పోస్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడే ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకుంటే ఎయిర్ పొల్యూషన్ అయ్యే చాన్స్ ఉంటుందని పీసీబీ అధికారులు చెబుతున్నారు. ఈ గుట్ట కారణంగా గాలి దుమారం వచ్చినప్పుడల్లా కుప్పల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో చెత్త పడుతోందని స్థానికులు వాపోతున్నారు.

భూ వివాదం ఇలా..

నిర్మాణ వ్యర్థాల గుట్టకు సంబంధించిన 13 ఎకరాల భూమి విషయంలో సందిగ్ధం నెలకొన్నది. ఈ భూమిపై కోర్టు కేసులు కూడా ఉన్నాయి. ఈ భూమి తమదని కొంత మంది క్లెయిమ్ చేసుకుంటున్నారు. అయితే ఈ భూమి ప్రభుత్వానిదా? ప్రయివేటు వ్యక్తులదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ భూమిపై టైటిల్ క్లియర్ చేయడానికి ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తున్నది. అయితే ప్రభుత్వ భూమి అని తేలితేనే గుట్టను క్లియర్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఒక వేళ ప్రయివేటు భూమి అయితే ఏం చేయాలనేదానిపై చర్చిస్తున్నట్టు సీఎంసీ అధికారులు చెబుతున్నారు. వ్యర్థాల గుట్టపై చర్యలు తీసుకోవడానికి అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, రెవెన్యూ, సీఎంసీ, పీసీబీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Next Story