- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాదాపుగా రెడీ అయిన ‘భూభారతి’ మార్గదర్శకాలు.. పక్కా రూల్స్ రూపొందిస్తేనే..
భూభారతి మార్గదర్శకాల ముసాయిదా తయారవుతున్నది. ఆర్వోఆర్-2025 చట్టం అమలుపై నేడు, రేపు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ నేతృత్వంలో ప్రభుత్వం రాష్ట్రస్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: భూభారతి మార్గదర్శకాల ముసాయిదా తయారవుతున్నది. ఆర్వోఆర్-2025 చట్టం అమలుపై నేడు, రేపు సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ నేతృత్వంలో ప్రభుత్వం రాష్ట్రస్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్నది. అయితే ఇందులో కేవలం ఎంపిక చేసిన అధికారులకు మాత్రమే ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వర్క్ షాప్ లో సెలెక్టెడ్ అధికారులు మాత్రమే కూర్చొని రూల్స్ రూపొందిస్తారా? ముసాయిదా రూల్స్ పైన చర్చిస్తారా? భూభారతి అమలు ఎలా ఉండాలో నిర్ణయిస్తారా? అనే దానిపై క్లారిటీ లేకుండాపోయింది. ఆర్వోఆర్-2025 రూపకల్పనపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. 14 ఏండ్ల తర్వాత ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిపుణుల అభిప్రాయ సేకరణ తర్వాత చట్టానికి తుదిరూపు లభించింది. అయితే ఇప్పుడీ భూ భారతి రూల్స్ ప్రజలకు అనుకూలంగా ఉంటాయా? అధికారుల ఇష్టాయిష్టాలతోనే రాస్తారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఆర్వోఆర్-2020లోని తప్పు చేసిన అధికారులపై చట్టరీత్య చర్యలు అన్న కాలమ్ ను యథాతథంగా కొనసాగించడాన్ని ఆఫీసర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో కేవలం అధికారులే కూర్చొని రూల్స్ రూపొందించుకోవడం ద్వారా ఎలాంటి ప్రతికూలతలు తలెత్తుతాయోనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు మంచి పేరు రావాలంటే ప్రజలకు అనుకూలంగా అధికార వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది.
పక్కా రూల్స్ రూపొందిస్తేనే..
భూ భారతి చట్టం అమలుకు రూపొందించే నిబంధనలు క్షేత్ర స్థాయిలో చేయదగ్గవిగా ఉండాలి. ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. ఆచరణాత్మకంగా ఉండాలి. ఏ ఉద్యోగి, ఏ అధికారి ఏం చేయాలో నిర్దిష్టంగా ఉండాలి. ఏ రూల్ తయారు చేసినా వెబ్ సైట్/వెబ్ పోర్టల్ లోని మాడ్యూల్స్ కి అనుకూలంగా ఉండాలి. దరఖాస్తు చేసుకుంటే ఆటోమెటిక్ గా నోటీసులు జనరేట్ కావాలి. ఆ నోటీసులు సర్వ్ చేయడం, రిపోర్టులు రాయడం.. అప్ లోడ్ చేస్తే పై స్థాయి అధికారికి వెళ్లడం.. అక్కడ ఆమోదిస్తే ఉన్నతాధికారి లాగిన్ కి చేరడం వంటి ఆప్షన్లు పక్కాగా పని చేయాలి. ఏ ఆప్షన్ ని అమలు చేసినా దానికి టెక్నాలజీ సపోర్ట్ చేయాలి. ధరణి పోర్టల్ రూపొందించిన తొలి రోజుల్లో చోటు చేసుకున్న తప్పిదాలు పునరావృతమైతే కష్టాలు కొని తెచ్చుకున్నట్టే! అందుకే రూల్స్.. టెక్నాలజీకి అనుకూలంగా ఉండాలి. ఆ రూల్స్ అధికారులు, సిబ్బంది చేయగలిగేలా ఉండాలని భూమి సునీల్ అభిప్రాయపడుతున్నారు. ఫీల్డ్ మిషనరీ, సాఫ్ట్ వేర్ ను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి దానికీ టైం లిమిట్స్ ఉండాలి. వీటిని కూడా ఆటోమెటిక్ గా అమలయ్యేటట్లు స్టెప్ బై స్టెప్ రూల్స్ తో పాటు టెక్నాలజీ సపోర్ట్ చేయాలి. ఇలాంటివన్నీ రూపొందించేటప్పుడు చట్టం తయారీలో చూపిన ప్రజాస్వామ్యబద్ధతను మరోసారి పాటించాలని రెవెన్యూ నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలకు భూ సమస్యలకు పరిష్కారం ఈజీగా లభించేలా మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతున్నారు.
ఆటోమెటిక్ నోటీస్
భూ భారతి మార్గదర్శకాలు అధికారులు, సిబ్బందికి ఆచరణాత్మకంగా ఉండాలి. ఉదాహరణకు సక్సెషన్ కు దరఖాస్తు వస్తే.. తహశీల్దార్ విచారణకు నోటీసులు జారీ చేసేలా ఉండాలి. అవి ఎవరి ద్వారా స్టేక్ హోల్డర్స్ కి వెళ్తాయో కూడా పేర్కొనాలి. నోటీసు కాల పరిమితి కూడా ఉండాలి. ఆ తర్వాత ఆటోమెటిక్ గా మ్యుటేషన్ అయ్యేలా టెక్నాలజీని కూడా రూపొందించాలి. విలేజ్ రికార్డుల నిర్వహణ ఎవరు చేయాలి? ఆర్వోఆర్ నిర్వహణకు ఫార్మాట్స్? డీమ్డ్ టూ మ్యుటేషన్ ఎట్లా? ఇవన్నీ రూల్స్ లో వస్తాయి. సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలన సెక్షన్ 8 కింద ఆర్డీవోలకు అప్పగించారు. ఇప్పుడు మ్యుటేషన్ చేసేందుకు వారికి లాగిన్ ఇవ్వాలి. అప్పీల్ చేసుకునేందుకు ఆప్షన్ ఉండాలి. అలాగే తహశీల్దార్ మ్యుటేషన్ చేస్తే ఆర్డీవోకు అప్పీల్ చేసుకునేందుకు కూడా వీలు కల్పించాలి. సెక్షన్ 7, 8 లో పేర్కొన్నట్లుగా తహశీల్దార్లు, ఆర్డీవోలకు మ్యుటేషన్లు చేసే వెసులుబాటు ఉండాలి. అప్పీల్ వ్యవస్థ కూడా వెంటనే ఏర్పడాలి.
రూల్స్ లేకనే ఫెయిల్
రాష్ట్రంలో ఆర్వోఆర్-1971 చట్టం 49 ఏండ్ల పాటు అమల్లో ఉంది. 1971 నుంచి 1989 వరకు రూల్స్ రూపొందించడానికే సరిపోయింది. 1996 వరకు కొన్ని వందల క్లారిఫికేషన్లు జారీ చేశారు. ఆర్వోఆర్ 2020 అమలు చేసేందుకు రూల్స్ రూపొందించలేదు. ఎప్పటికప్పుడు సర్క్యూలర్లతోనే కాలం వెళ్లదీశారు. ఏ పనిని ఏ స్థాయి అధికారి చేయాలో తెలియదు. అందుకే ధరణి పోర్టల్ ఫెయిల్ అయ్యింది. ఆఖరికి తహశీల్దార్ సంతకం కూడా కలెక్టర్ ఫోర్జరీ చేసేటట్లుగా రూపొందించారు. కలెక్టర్ ఆమోదించినా తహశీల్దార్ సంతకంతోనే ఆర్డర్ రిలీజ్ అయ్యే విధానాన్ని గతంలో పని చేసిన ఐఏఎస్ అధికారులు రూపొందించారు. ఇప్పుడు అలాంటి అధికారుల అభిప్రాయాలతోనే భూ భారతి నిబంధనలను తయారు చేస్తే ఘోరంగా విఫలమయ్యే అవకాశం ఉంది. కనీసం అప్పీల్ వ్యవస్థ లేకుండా చేసిన పాపం అప్పటి ఐఏఎస్ అధికారులదే. రెవెన్యూ సిబ్బంది తప్పు చేసినా కోర్టుకు వెళ్లి ఆర్డర్ తీసుకురావాలంటూ లిఖితపూర్వకంగా రాసిచ్చే వ్యవస్థను అమలు చేసిన ఘనత సోమేష్ కుమార్ నాయకత్వంలోని పని చేసిన అధికారులకు దక్కుతుంది. ఇప్పుడు అలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా ఉండాలంటూ ప్రజామోదయోగ్యంగా రూల్స్ ఉంటేనే సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి మంచి పేరొస్తుందంటున్నారు.
రెండు నెలలుగా అన్నీ బంద్
నల్లగొండ జిల్లాలో ఓ దరఖాస్తుదారుడు రెండేండ్ల నుంచి తన సమస్య పరిష్కరించాలని తిరుగుతున్నాడు. రెండు సార్లు పంపిన రిపోర్ట్ ని కలెక్టర్ రిజెక్ట్ చేశారు. ఆఖరికి మాడ్యూల్ మార్చి మళ్లీ అప్లయ్ చేసుకోవాలంటే అదీ చేశారు. ఇప్పుడు రిపోర్ట్ పంపి నెలన్నరయినా కలెక్టరేట్ అధికారులు కనీసం పరిశీలించలేదు. రిక్వెస్ట్ చేస్తే ఫైల్ చూసి పంపిన రిపోర్టులో తప్పులు ఉన్నాయి. సరి చేసి మళ్లీ పంపాలంటూ మండలానికి పంపుతున్నారు. ఇదేదో రిపోర్ట్ పంపిన రోజో, మరుసటి రోజో చేయాలి. కానీ 45 రోజుల తర్వాత చూసి మళ్లీ ఫైల్ ని తిప్పి పంపిస్తున్నారు. ఇలాంటి పరిణామాలు ప్రతి జిల్లాలోనూ చోటు చేసుకుంటున్నాయి. గడిచిన రెండు నెలలుగా తమ దరఖాస్తుకు పరిష్కారం లభించిందని చెప్పిన ఒక్క దరఖాస్తుదారుడు కూడా లేకపోవడం గమనార్హం. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతేనంటూ దాటవేత ధోరణిని అవలంభిస్తుండడం విడ్డూరం. వారి పరిధిలోనే పరిష్కరించే అధికారాన్ని పెట్టుకొని ఏండ్ల తరబడి తిప్పించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కొందరు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దరఖాస్తులకు పరిష్కారాలు ఉన్నాయి. ఎవరు చేయాలో కూడా నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో వచ్చాం.. త్వరలోనే బదిలీ అయి మరో చోటికి వెళ్లిపోతామంటూ బహిరంగంగానే చెబుతున్న తహశీల్దార్లు ఉన్నారు. మరోవైపు భూభారతి పేరుతో అధికారులు కొన్ని నెలల నుంచి భూ సమస్యల దరఖాస్తులను పెండింగులో పెట్టారు. అప్లికేషన్ల స్టేటస్ తెలుసుకునేందుకు ఒక్క రివ్యూ కూడా నిర్వహించలేదు. మండల స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు.. అంతటా భూ భారతి వచ్చేస్తుందంటూ కాలయాపన చేస్తున్నారు.






