రాజీనా? ముందు జాగ్రత్తా..? గవర్నర్ స్పీచ్ ప్రగతికే పరిమితం

by Disha Web Desk 4 |
రాజీనా? ముందు జాగ్రత్తా..?  గవర్నర్ స్పీచ్ ప్రగతికే పరిమితం
X

అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ ఎలా ఉంటుందోనని.. అటు రాజకీయ నాయకులతో పాటు ఇటు ప్రజలు సైతం ఉత్కంఠగా ఎదురుచూశారు. ప్రభుత్వం తయారు చేసిన స్పీచ్‌లో ఏముంటుంది? కేంద్రంపై విమర్శలు ఉంటాయా? ఉంటే వాటిని గవర్నర్ చదువుతారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. గతంలో కేంద్రంపై సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించినా.. గవర్నర్ స్పీచ్‌‌లో అలాంటివేవీ కనిపించలేదు. సెంట్రల్‌పై విమర్శలను పొందుపరిస్తే గవర్నర్ వాటిని తప్పిస్తారనే అనుమానంతోనే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త తీసుకున్నదా? లేదంటే కేంద్రంతో ఘర్షణ ఎందుకంటూ ఓ మెట్టు దిగి రాజీకి వచ్చిందా? అనే చర్చ ఎమ్మెల్యేల్లో మొదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రసంగం రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు మాత్రమే పరిమితమైంది. ఎనిమిదిన్నరేండ్ల కాలంలోని పథకాలు‌, డెవలప్‌‌మెంట్ అంశాలను మాత్రమే ఆమె ప్రస్తావించారు. ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్టును ఆసాంతంగా ఆమె చదివారు. ఎక్కడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు లేకుండా స్పీచ్‌ తయారీలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకున్నది.

కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ ఎందుకంటూ రాజీ పడిందా? లేక ముందుజాగ్రత్త చర్యగానే తనకు తానుగా పరిమితులు విధించుకున్నదా? లేక ఇటీవలి పరిణామాలను చూసిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే ఒక మెట్టు దిగాలనుకున్నదా?.. ఇవీ అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేల మధ్య జరిగిన చర్చలు. స్క్రిప్టులో ఎక్కడా ఎలాంటి కత్తిరింపులు, అదనంగా చేర్చడం లాంటివి లేకుండా గవర్నర్ ప్రసంగం ముగిసింది. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశం మొత్తానికే తెలంగాణ స్టేట్ ఆదర్శంగా ఉన్నదంటూ గవర్నర్ స్పీచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించినా కేంద్రం సహకారం ఇవ్వడం లేదని గానీ, మరింత సహకారం కావాలని గానీ ప్రస్తావన చేయకపోవడం గమనార్హం.

గతంలో సీఎం కామెంట్స్

రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11 లక్షల కోట్లు దాటిందని, కేంద్రం సహకరించి ఉంటే మరో రూ.3 లక్షల కోట్లు పెరిగి రూ.14 లక్షల కోట్లకు చేరుకునేదంటూ సీఎం గతంలో పలు సందర్భాల్లో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన పాలసీ లేదని, అభివృద్ధి దిశగా నడిపించే సామర్థ్యం లేదని, దూరదృష్టి కూడా కొరవడిందని, నరేంద్ర మోడీ ఒక అసమర్ధ ప్రధానిగా ఉన్నారంటూ గతంలో పలు బహిరంగసభల వేదికల మీద సీఎం కేసీఆర్ విమర్శించారు. తొమ్మిదేండ్లలో సాధించిందేమీ లేదని, పేదల సంక్షేమంపై సరైన దృక్పథం లేదని, రాష్ట్రప్రభుత్వాలు అమలుచేస్తూ ఉంటే 'ఉచితం' స్కీమ్‌లు మంచివి కావంటూ ప్రధాని చేసిన కామెంట్స్‌ను కేసీఆర్ గుర్తుచేసి ఫైర్ అయ్యేవారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగానూ తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీ లేదని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత తదితరులు కామెంట్ చేశారు. కానీ గవర్నర్ స్పీచ్‌లో మాత్రం అలాంటివేమీ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు ఆదేశాల తర్వాత గవర్నర్ ప్రసంగం అసెంబ్లీలో ఉంటుందని క్లారిటీ రాగానే మంత్రి ప్రశాంత్‌రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి ఆమెకు ఆహ్వానం పలికారు. ఆ సందర్భంగానే స్పీచ్ తయారీపైన కూడా గవర్నర్, మంత్రి మధ్య చర్చలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ ఏవీ స్పీచ్‌లో ఉండవద్దంటూ గవర్నర్ ఆ సందర్భంగా మంత్రికి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని మంత్రి వద్ద ప్రస్తావించగా అలాంటి చర్చలేమీ జరగలేదంటూ బదులిచ్చారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడి స్పీచ్ ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

సాఫీగా..

అసెంబ్లీలో స్పీచ్ కాపీ గవర్నర్ కోరుకున్న విధంగానే రావడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది. అరగంట పాటు సాగిన తన ప్రసంగంలో కేవలం రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే గవర్నర్ చదివారు. తమిళిసై, మంత్రి ప్రశాంత్‌రెడ్డి మధ్య జరిగిన చర్చలు, ఆమె చేసిన సూచనలు వాస్తవమేననే అభిప్రాయం లాబీల్లో పలువురు ఎమ్మెల్యేలలో గవర్నర్ ప్రసంగం తర్వాత వ్యక్తమైంది. ఈ ఏడాదిలో ఎన్నికలు జరగనున్నందున జాగ్రత్తగా వ్యవహరించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం వ్యూహాత్మకంగా స్పీచ్‌ను తయారు చేసి ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

స్కిప్ చేసే ఛాన్స్

ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పీచ్‌లో ప్రస్తావన ఉన్నట్లయితే గవర్నర్ ఆ వాఖ్యలను స్కిప్ చేసే అవకాశమున్నదని, అది రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య మరింత గ్యాప్ పెరగడానికి, సరికొత్త వివాదం తెరపైకి వచ్చే ఛాన్స్ ఉందన్న అభిప్రాయం నాలుగు రోజుల క్రితమే వ్యక్తమైంది. దాదాపు ఏడాదికి పైగా ప్రగతిభవన్, రాజ్‌భవన్‌కు మధ్య ఏర్పడిన గ్యాప్.. ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నదనే వాతావరణం నెలకొన్న సమయంలో రిస్కు తీసుకోవాల్సిన అవసరం వద్దనే భావనతోనే స్పీచ్‌ తయారీలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది.

నొప్పించక తానొవ్వక తరహాలో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. విపక్షాలు సహజంగానే గవర్నర్ ప్రసంగంపై పెదవి విరిచాయి. ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్టుకు మాత్రమే ఆమె పరిమితమయ్యారన్న అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అబద్ధాలను ప్రసంగంలో పెట్టి ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రభుత్వం వ్యవహరించిందన్న విమర్శలూ వ్యక్తమయ్యాయి. గవర్నర్ ప్రసంగంలో ఏముంటుందనే ఉత్కంఠ మూడు రోజులుగా కొనసాగింది. కానీ కేంద్రంపై విమర్శలు లేకుండా కేవలం రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే స్పీచ్‌లో పొందుపర్చడం గమనార్హం.



Next Story

Most Viewed