ఆయిల్ పామ్ రైతులకు పండగ.. టన్ను గెలల ధర రూ. 23 వేలు క్రాస్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ఆయిల్ పామ్ గెలల ధర టన్నుకు రూ.23,005కు పెరిగిందని, ఫార్మర్ రిజిస్ట్రీ నమోదులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

ఆయిల్ పామ్ రైతులకు పండగ.. టన్ను గెలల ధర రూ. 23 వేలు క్రాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం కలిగించేలా మరోసారి గెలల ధరలు పెరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ధర పెరగడంతో రైతులకు ఆర్థికంగా లాభం చేకూరనుంది. ఇప్పటివరకు టన్నుకు రూ. 21,546గా ఉన్న గెలల ధర, రూ. 1,459 పెరిగి ప్రస్తుతం రూ. 23,005కు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ ధరల పెరుగుదలతో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ధరలు పెరగడం రైతుల్లో నమ్మకాన్ని పెంచుతుందని, భవిష్యత్తులో మరింత మంది రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపడుతోందని వివరించారు. సాగు విస్తీర్ణం పెంపు కోసం ఉచితంగా మొక్కలను సరఫరా చేయడం, డ్రిప్ సౌకర్యం కల్పించడం, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆయిల్ పామ్ పంట రైతులకు దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం అందించే పంటగా నిలుస్తోందని, పెరిగిన ధరలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఫార్మర్ రిజిస్ట్రీలో దేశంలోనే తెలంగాణ ముందు వరుస:

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతుల 'ఫార్మర్ రిజిస్ట్రీ' నమోదు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉన్నట్లు ఆయన వివరించారు. ఫార్మర్ రిజిస్ట్రీ అమలు తీరుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు.

నమోదు ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నామని, వచ్చే మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేస్తామని తెలిపారు. రైతుల సమగ్ర డేటా నమోదు ద్వారా ప్రభుత్వ పథకాల అమలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో యూరియా లభ్యత, పంపిణీ పరిస్థితులు, యూరియా యాప్ అమలు విధానం గురించి కూడా కేంద్ర మంత్రికి వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, కేంద్ర కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్రానికి సమయానికి యూరియా సరఫరా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Next Story