- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నదాతలకు కాసుల పంట.. రబీ ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ సరికొత్త రికార్డు
తెలంగాణ వ్యాప్తంగా 2025-26 రబీ ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా 2025-26 రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లు అత్యంత వేగంగా, రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. ఇవాళ్టికి అందిన అధికారిక లెక్కల ప్రకారం.. తెలంగాణలో ఇప్పటి వరకు 40.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం విజయవంతంగా కొనుగోలు చేసినట్లుగా పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. కొనుగోళ్లు ఇంకా ముమ్మరంగా కొనసాగుతుండటంతో ఈ సంఖ్య మరింత పెరగనుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది రికార్డు స్థాయిలో 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి రైతులకు రూ.6,462.73 కోట్ల చెల్లింపులను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు.
చరిత్రలోనే అత్యధిక కొనుగోలు కేంద్రాలు..
గత కొన్ని రబీ సీజన్ల కంటే ఈసారి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచింది. 2021-22లో 6,609 కేంద్రాలు, 2022-23లో 7,037 కేంద్రాలు, 2023-24లో 7,178 కేంద్రాలు, 2024-25లో 8,378 కేంద్రాలు ఉండగా.. ఈసారి ఏకంగా 8,575 ధాన్యం కొనగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, గత ప్రభుత్వ హయాంలోని రబీ సీజన్లతో పోలిస్తే.. మే 18 నాటికి ఈ ఏడాది జరిగిన కొనుగోళ్లు భారీ పురోగతిని సాధించాయి.
గత ప్రభుత్వాల రికార్డులను బ్రేక్..
ప్రస్తుత రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. మే 18 నాటికి అందిన అధికారిక లెక్కల ప్రకారం, ప్రభుత్వం ఇప్పటివరకు ఏకంగా 40.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా కొనుగోలు చేసింది. గత నాలుగేళ్ల రబీ సీజన్ల గణాంకాలతో పోల్చి చూస్తే ఈ ఏడాది సాధించిన పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2021-22 రబీ సీజన్‌లో ఇదే సమయానికి కేవలం 21.79 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించగా, ఈసారి దానికి అదనంగా మరో 18.24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. అలాగే 2022-23 రబీ నాటి 30.40 లక్షల మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఈ ఏడాది 9.63 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువగా కొనుగోలు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన గత కొనుగోళ్లతో పోల్చినా ఈ ఏడాది గణనీయమైన వృద్ధి నమోదైంది. గత 2023-24 రబీ సీజన్‌లో మే 18 నాటికి జరిగిన 36.01 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణతో పోలిస్తే, ఈసారి 4.02 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువగా ధాన్యం సేకరించడం విశేషం. అయితే, గతేడాది (2024-25) ఇదే సమయానికి 54.18 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరగ్గా, ప్రస్తుతం ఆ సంఖ్య 40.03 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. కానీ, ప్రస్తుత రబీ సేకరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో తుది నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మొత్తం మీద చూస్తే.. అత్యధిక కేంద్రాల ఏర్పాటు, వేగవంతమైన చెల్లింపులు, పారదర్శకమైన సేకరణ విధానాల వల్లే ఈ ఏడాది ప్రభుత్వం రికార్డు స్థాయి కొనుగోళ్లను సాధించగలిగింది.






