వైద్య రంగంలో సరికొత్త విప్లవం: ప్రాణాంతక జబ్బులకు ‘కృత్రిమ’ యుద్ధం!

by Vemula.Srinu Prasad |

క్యాన్సర్, గుండె, మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి, రోగులకు వేగవంతమైన, ఖచ్చితమైన చికిత్స అందించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వైద్య పరిశోధనలు ఊపందుకోనున్నాయి...

వైద్య రంగంలో సరికొత్త విప్లవం: ప్రాణాంతక జబ్బులకు ‘కృత్రిమ’ యుద్ధం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: క్యాన్సర్, గుండె, మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి, రోగులకు వేగవంతమైన, ఖచ్చితమైన చికిత్స అందించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వైద్య పరిశోధనలు ఊపందుకోనున్నాయి. హైదరాబాద్‌లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్), బెంగళూరుకు చెందిన ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) సంయుక్తంగా ఈ వినూత్న పరిశోధనలకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తల బృందం గురువారం నిమ్స్ ఆసుపత్రిని సందర్శించి, ఇరు సంస్థల వైద్య నిపుణులు, అధ్యాపకులతో విస్తృతంగా చర్చించింది.

నిమ్స్ రోగుల డేటాతో దేశీయ ఏఐ మోడల్స్...

ప్రస్తుతం వైద్య రంగంలో అందుబాటులో ఉన్న చాలా ఏఐ టూల్స్ విదేశీ రోగుల డేటా, వారి శారీరక తత్వాల ఆధారంగా రూపొందినవి. కానీ, ఈ ప్రాజెక్టు ద్వారా నిమ్స్ ఆసుపత్రికి వచ్చే వేలాది మంది స్థానిక, దేశీయ రోగుల క్లినికల్ డేటాను ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు. తద్వారా భారతీయ రోగుల జీవనశైలి, జన్యుపరమైన ధోరణులకు సరిగ్గా సరిపోయేలా (ఇండీజినస్ ఏఐ మోడల్స్) ఈ అల్గోరిథమ్‌లను డెవలప్ చేయనున్నారు. ఇది వైద్య రంగంలో గేమ్ ఛేంజర్‌గా మారనుంది.

ఆరు నెలల్లో తొలి దశ పూర్తి...

ఈ కీలక ప్రాజెక్టుకు సంబంధించిన తొలి దశను రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి. ఈ ఆరు నెలల కాలంలో రోగుల క్లినికల్ డేటా విశ్లేషణ, ఏఐ అల్గోరిథమ్‌ల రూపకల్పన, ప్రాథమిక నమూనాల (ప్రొటోటైప్స్) అభివృద్ధిని చేపట్టనున్నారు. భారతీయ రోగుల శారీరక పరిస్థితులు, జీవనశైలికి అనుగుణంగా, తక్కువ వ్యయంతో, అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఏఐ నిర్ధారణ సాధనాలను రూపొందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. కాగా... ఈ కీలకమైన ప్రాజెక్టులో నిమ్స్ తరఫున డీన్ డా. పి. చంద్రశేఖర్‌తో పాటు ప్రముఖ వైద్య నిపుణులు డా. లిజా, డా. శ్రీ భూషణ్ రాజు, డా. అనూకపూర్, డా. సుబ్బలక్ష్మి, డా. సుజాతా పట్నాయక్, డా. రామకృష్ణ, డా. ఆన్నీ, డా. రవితేజ, డా. పాయల్... ఐఐఎస్‌సీ బెంగళూరు తరఫున శాస్త్రవేత్తలు డా. శ్రీరామ్, డా. హేమ, డా. అనఘ హాజరై ఉమ్మడి పరిశోధనల కార్యాచరణను ఖరారు చేశారు.

నిమ్స్‌కు, వైద్య రంగానికి చేకూరే ప్రయోజనాలు ఇవే...

ముందస్తు హెచ్చరికలు (ఎర్లీ డెటెక్షన్): రొమ్ము, నోటి క్యాన్సర్లు థర్డ్ లేదా ఫోర్త్ స్టేజ్‌కు వచ్చే వరకు చాలా మందిలో బయటపడవు. ఏఐ స్క్రీనింగ్ టూల్స్ ద్వారా ప్రిలిమినరీ స్టేజ్‌లోనే కణజాలాల్లోని మార్పులను పసిగట్టవచ్చు.

వైద్యులపై తగ్గుతున్న ఒత్తిడి, ఖచ్చితమైన నిర్ణయాలు: నిమ్స్ లాంటి ప్రభుత్వ మేజర్ ఆసుపత్రులకు రోగుల రద్దీ విపరీతంగా ఉంటుంది. రేడియాలజీ రిపోర్టులు, బయాప్సీ స్లైడ్స్, ఈసీజీ, ఎకో గ్రాఫ్‌లను ఏఐ సెకన్ల వ్యవధిలో స్కాన్ చేసి, ఎక్కడ లోపం ఉందో హైలైట్ చేస్తుంది. దీనివల్ల వైద్యులు తక్కువసమయంలో ఎక్కువ మందికి ఖచ్చితమైన చికిత్స అందించే వీలుంటుంది.

కిడ్నీ, గుండె జబ్బుల ముందస్తు అంచనా: రోగి యొక్క పాత మెడికల్ హిస్టరీని విశ్లేషించి, భవిష్యత్తులో సదరు రోగికి గుండెపోటు వచ్చే అవకాశం ఎంత ఉందో, లేదా కిడ్నీలు ఎంతవరకు దెబ్బతినే ప్రమాదం ఉందో ఏఐ అల్గోరిథమ్స్ ముందే అంచనా వేస్తాయి.

కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి...

ప్రాజెక్టు రూపకల్పనపై ఐఐఎస్సీ సైంటిస్టులతో సుదీర్ఘంగా చర్చించాం. రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బులు, ఊబకాయం వంటి ప్రాణాంతక సమస్యలను ముందే గుర్తించడంలో ఏఐ టూల్స్ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని భావిస్తున్నాం. వ్యాధి నిర్ధారణతో పాటు, ప్రమాద అంచనా, వ్యాధి తీవ్రత విశ్లేషణ, రోగి వ్యక్తిగత ఆరోగ్య స్థితిని బట్టి ప్రత్యేక చికిత్సా విధానాలను (పర్సనలైజ్డ్ మెడిసిన్) అందించేందుకు అత్యాధునిక ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడమే నున్నాం. ఇవి వైద్యులకు క్లినికల్ నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతూ, సామాన్యుడికి సైతం అత్యాధునిక వైద్యాన్ని చేరువ చేస్తాయి.

- నిమ్స్ డీన్ డా. పి. చంద్రశేఖర్

Next Story