- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్ భవన్‌లో ‘ఏ’ బ్లాక్ స్వాధీనం.. తాళాలు పగలగొట్టిన ఐటీ, జీఎస్టీ అధికారులు
హైదరాబాద్ బస్ భవన్‌లో ఐటీ, జీఎస్టీ అధికారులు ఏ బ్లాక్‌ను స్వాధీనం చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్ వేదికగా హైడ్రామా నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇక్కడ నాలుగు అంతస్తులను కేటాయించిందంటూ ఐటీ, జీఎస్టీ అధికారులు ఒక్కసారిగా బస్ భవన్‌లో పాగా వేశారు. ఏ బ్లాక్‌లో ఉన్న నాలుగు ఫ్లోర్ల తాళాలు పగలగొట్టి, తమ సొంత తాళాలు వేసుకుని ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆర్టీసీ కార్మికులు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చారని ఆర్టీసీ అధికారులు చెబుతుండగా... కార్పోరేషన్ ఆస్తిపై ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాజమాన్యం మాత్రం తాము ఏమీ చేయలేమనే విధంగా చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఏపీ సైతం ఇది ఉమ్మడి ఆస్తి అని తెలంగాణ ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని సీరియన్ అయినట్లు సమాచారం. మొత్తంగా బుధవారం బస్ భవన్ వేదికగా తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు తెలత్తాయి.
ఉద్యోగుల విలీనానికి ముందే ఆస్తుల స్వాధీనమా?
ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ పూర్తికాకముందే కార్పొరేషన్ పరిధిలో ఉన్న బస్ భవన్ ఆస్తులపై ప్రభుత్వం అజమాయిషీ చలాయించడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి డిపోలను, స్థలాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతుంటే... మరోవైపు ప్రధాన కార్యాలయాన్ని ఇలా ఇతర శాఖలకు కేటాయించడం వెనుక ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా, కార్మికులు, ప్రజలకు కనీస సమాచారం లేకుండా కార్పొరేషన్ ఆస్తులను ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని వారు ప్రశ్నించారు. ఉద్యోగులను రోడ్డున పడేసే కుట్రకు తెర తీస్తున్నారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గురువారం జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. మరోవైపు అశ్వద్ధామరెడ్డి నేతృత్వంలోని మరో జేఏసీ బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమై.. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వకుంటే బస్ భవన్ వద్ద ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించింది. కాగా... ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కార్మికుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
ఏపీ సర్కార్ సీరియస్..
రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం ఆర్టీసీ ఆస్తుల విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. పదేళ్ల పాటు ఏపీఎస్ఆర్టీసీ ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగించింది. ఏపీ అధికారులు వెళ్తూ ఏ బ్లాక్‌కు తాళాలు వేసి వెళ్లగా, ఇప్పుడు వాటిని పగులగొట్టడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆస్తిగా ఉన్న భవనాన్ని ఏకపక్షంగా ఎలా కేటాయిస్తారని ఏపీ సీఎస్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం.






