చిన్న వయసులో పెద్ద మనసు.. క్యాన్సర్ బాధితుల కోసం జుట్టును దానం చేసిన నాగోల్ చిన్నారి

by Ramesh Naini |

మానవత్వానికి వయసుతో పనిలేదని, సాయం చేయాలనే సంకల్పం ఉంటే చాలని నిరూపించింది ఓ 11 ఏళ్ల చిన్నారి. క్యాన్సర్‌తో పోరాడుతూ కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోయి, మానసికంగా కుంగిపోతున్న బాధితుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు తన జుట్టును దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది.

చిన్న వయసులో పెద్ద మనసు.. క్యాన్సర్ బాధితుల కోసం జుట్టును దానం చేసిన నాగోల్ చిన్నారి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మానవత్వానికి వయసుతో పనిలేదని, సాయం చేయాలనే సంకల్పం ఉంటే చాలని నిరూపించింది ఓ 11 ఏళ్ల చిన్నారి. క్యాన్సర్‌తో పోరాడుతూ కీమోథెరపీ వల్ల జుట్టు కోల్పోయి, మానసికంగా కుంగిపోతున్న బాధితుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు తన జుట్టును దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని నాగోల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగోల్‌లోని ఆల్కాపురి కాలనీకి చెందిన ఆద్య అనే చిన్నారి స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న వారి అవస్థలను, ముఖ్యంగా చికిత్సలో భాగంగా జుట్టు రాలిపోయి వారు పడుతున్న మానసిక వేదనను చూసి ఆ చిన్నారి చలించిపోయింది. వారికి ఎలాగైనా తన వంతు సాయం చేసి అండగా నిలవాలనుకుంది. ఈ క్రమంలోనే తనకు ఎంతో ఇష్టమైన తల జుట్టును ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా క్యాన్సర్ బాధితులకు విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకుంది.

ఆద్య మాటల్లో.. కదిలించే భావోద్వేగం

జుట్టు దానం చేసిన అనంతరం ఆద్య మాట్లాడుతూ.. ‘నా జుట్టు పోతోందనే బాధ కన్నా.. అది క్యాన్సర్ బాధితులకు ఉపయోగపడుతోందనే ఆనందమే నాకు ఎక్కువగా ఉంది. ఇతరుల ముఖంలో చిరునవ్వు తీసుకురావడమే మనం దాల్చే నిజమైన అందం’ అని చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి మనసులను కదిలిస్తున్నాయి. కాగా, ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో క్యాన్సర్ రోగుల పట్ల ఆద్య చూపిన కరుణ, చేసిన త్యాగం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పదేళ్ల వయసుకే తోటి వారి బాధను అర్థం చేసుకొని, ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న ఆద్యకు నెటిజన్లు ‘హ్యాట్సాఫ్’ చెబుతున్నారు. చిన్న వయసులోనే మానవత్వం చాటి చెప్పిన ఈ చిన్నారి ఆలోచనా విధానంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story