మన్ననూరులో 800 ఏళ్ల నాటి క్వారీలు గుర్తింపు

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-08-04 15:03:15  IST  )

హైదరాబాద్- శ్రీశైలం రహదారిలోని మన్ననూరు ఘాట్ రోడ్‌లో కళ్యాణ చాళుక్యుల కాలపు రాతి క్వారీలను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు.

మన్ననూరులో 800 ఏళ్ల నాటి క్వారీలు గుర్తింపు
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్- శ్రీశైలం రహదారిలోని మన్ననూరు ఘాట్ రోడ్‌లో కళ్యాణ చాళుక్యుల కాలపు రాతి క్వారీలను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. వారసత్వ స్థావరాలను గుర్తించి, వాటిని కాపాడుకోవడానికి స్థానికులకు అవగాహన కల్పించే ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టరిటీ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా, మన్ననూరు పరిసరల్లోని ప్రతాపరుద్రుని కోట వద్ద రోడ్డు కుడి (ఉమామహేశ్వరం) వైపున రాతిని తొలచిన ఆనవాళ్లను గుర్తించి, సమీపంలోని రాతి తోరణం, కోట గోడలు కట్టడానికి ఈ రాతినే వాడి ఉంటారని చెప్పారు.

పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్రలోని పర్వత ప్రకరణంలో ప్రస్తావించిన శివపుర ద్వారం ఈ తోరణమేనని ఈ ప్రాంతంపై విస్తృతంగా పరిశోధనలు చేసిన చరిత్రకారుడు డా.ద్యావనవల్లి సత్యనారాయణ తెలిపారని, తద్వారా ఈ రాతి క్వారీలు క్రీ.శ. 12వ శతాబ్దానికి చెందినవని తేలుతుందని శివనాగిరెడ్డి అన్నారు. చారిత్రక ప్రాధాన్యత గల ఈ రాతి క్వారీలను, తోరణ ద్వారాన్ని, ప్రతాపరుద్రుని కోటను కాపాడుకొని, శ్రీశైలం వెళ్ళే పర్యాటకులను ఆకర్షించే విధంగా పరిసరాలను సౌకర్యాలతో అభివృద్ధి పరచాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Next Story