ఆపరేషన్ వికటించి మృతిచెందిన కేసులో 8 లక్షల పరిహారం

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-08 15:18:03  IST  )

ట్యూబెక్టమీ శస్త్రచికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటనలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) కీలక తీర్పు వెలువరించింది.

ఆపరేషన్ వికటించి మృతిచెందిన కేసులో 8 లక్షల పరిహారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ట్యూబెక్టమీ శస్త్రచికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటనలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్ఆర్సీ) కీలక తీర్పు వెలువరించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి సంభవించిందని నిర్ధారిస్తూ, బాధితురాలి కుటుంబానికి అదనంగా రూ. 8 లక్షల పరిహారం చెల్లించాలని కమిషన్ చైర్మన్ గౌరవ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఎం. లలిత అనే మహిళకు ట్యూబెక్టమీ శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే, శస్త్రచికిత్స సమయంలో ప్రేగులకు గాయం కావడం, దానిని సకాలంలో గుర్తించకపోవడంతో సెప్టిక్ పెరిటోనైటిస్ ఏర్పడి కార్డియో పల్మనరీ అరెస్ట్ దారితీసిన కారణంగా ఆమె మృతి చెందారు.

దీనిపై దాఖలైన కేసును విచారించిన కమిషన్ మంగళవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కేవలం శారీరక ప్రతిచర్య మాత్రమే అన్న అధికారుల వాదనను కమిషన్ తోసిపుచ్చింది. శస్త్రచికిత్స సమయంలో జరిగిన పొరపాటు, తదుపరి నిర్లక్ష్యమే మరణానికి కారణమని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన పొరపాటుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని కమిషన్ పేర్కొంది. ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిన రూ. 2 లక్షల పరిహారం, మృతురాలి వికలాంగ భర్త, ఇద్దరు మైనర్ కుమారుల భవిష్యత్తుకు ఏమాత్రం సరిపోదని కమిషన్ అభిప్రాయపడింది. అందుకే అదనంగా రూ. 8 లక్షలు చెల్లించాలని సూచించింది. తల్లీ లేక, వికలాంగుడైన తండ్రి ఆసరా లేక ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబం గౌరవప్రదంగా జీవించేందుకు మృతురాలి భర్తకు తగిన ఉపాధి మార్గం చూపాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

Next Story