Javahar Navodaya Vidyalaya : తెలంగాణకు కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు

by Muthe.Rajitha |   (  Updated:2025-06-16 15:49:26  IST  )

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ(Telangana)కు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాల(JNV)ను మంజూరు చేసింది.

Javahar Navodaya Vidyalaya : తెలంగాణకు కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు
X

దిశ,వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ(Telangana)కు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాల(JNV)ను మంజూరు చేసింది. అయితే ఈ కొత్త విద్యాలయాల ఏర్పాటుకు 2024 డిసెంబర్‌లో ఆమోదం తెలిపినప్పటికీ, నేడు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్‌నగర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో స్థాపించబడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దేశవ్యాప్తంగా 28 నవోదయ విద్యాలయాలు, 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం లభించింది.

ప్రస్తుతం తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాలు (కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్‌కర్నూల్, నల్గొండ, కామారెడ్డి, వరంగల్, రంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం) ఉండగా, కొత్తగా మంజూరైన 7తో కలిపి మొత్తం 16కు చేరనున్నాయి. ఈ కొత్త విద్యాలయాల ఏర్పాటుకు 2024-29 మధ్యకాలంలో రూ.2,359 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో మూలధన వ్యయం రూ.1,944 కోట్లు, నిర్వహణ ఖర్చు రూ.415 కోట్లుగా అంచనా వేయబడింది.

తెలంగాణ విద్యాశాఖ అధికారులు నవోదయ విద్యాలయ అధికారులతో సమావేశమై, ఈ 7 విద్యాలయాల్లో జూలై 14, 2025 నుంచి తరగతులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ విద్యాలయాలు పూర్తిస్థాయి రెసిడెన్షియల్ పాఠశాలలుగా ఉంటాయి, బాలబాలికలకు ఉచిత విద్య, హాస్టల్ వసతి, దేశభక్తి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్‌సీసీ, చిత్రలేఖనం వంటి శిక్షణను అందిస్తాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75% సీట్లు కేటాయించబడతాయి, ప్రవేశాలు జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST) ద్వారా జరుగుతాయి.

Next Story