- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : కొత్తగా 571 స్కూల్స్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో భారీగా కొత్త ప్రభుత్వ పాఠశాల(New Govt Schools)ను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి)CM Revanth Reddy) ప్రకటించారు. పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.
విద్యా ప్రమాణాలు పెంపు లక్ష్యంతో రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. బోధన ప్రమాణాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాల పెంపునకు వీలుగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని చెప్పారు. హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తే భవిష్యత్‌లో వారు తమకు ఇష్టమైన రంగంలో రాణించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో పట్టణీకరణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యా శాఖ పురపాలక శాఖతో సమన్వయం చేసుకొని హెచ్ఎండీఏ, మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం గుర్తించిన స్థలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇలా వివిధ విభాగాల కింద ఇంటర్మీడియట్ వరకు ఉన్న వివిధ విద్యా సంస్థలను హేతుబద్దీకరించి ప్రతి పాఠశాలలో నిర్ధిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నాణ్యమైన భోజనం, యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు అందిస్తుండడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నారని, డే స్కాలర్స్‌కూ ఆ పాఠశాలల్లోనే అవన్నీ అందించే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
పిల్లలకు కుటుంబం, సమాజం ప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు కుటుంబం, సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేసేలా కౌన్సెలింగ్ ఇప్పిస్తే వారు మానసికంగా దృఢంగా తయారవడంతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా రాణిస్తారని అన్నారు.






