- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
50 వేల మెజారిటీ పక్కా.. : బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి
‘బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో విజయం సాధిస్తా..

దిశ, రాజేంద్రనగర్ : ‘బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.. వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో విజయం సాధిస్తా.. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఎన్నో భూములను కబ్జా చేశారు.. నేను నిరూపిస్తానని సవాల్ విసిరినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాలు తన అనుచరులకే కట్టబెట్టారు. నాకు అమిత్ షా, మోదీ ఆశీర్వాదం ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా’ అని రాజేంద్రనగర్ బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ‘దిశ'కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
గెలిస్తే ఏమేమి చేస్తారు?
రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలు ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలి. అన్ని సమస్యలను పరిష్కరిస్తా. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రకాశ్ గౌడ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమీ చేయలేదు. ఇంటర్, డిగ్రీ కళాశాలలు, అస్పత్రులు.. ఇలా ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. ఆయన తన స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేశారు. నియోజకవర్గంలో మంచినీటి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. శంషాబాద్ లో మార్కెట్, బస్టాప్‌లను అభివృద్ధి చేస్తా. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తా. ఇప్పటివరకు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తన అనుచరులకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాలను అందజేశారు. అర్హులైన నిరుపేదలకు తీవ్ర అన్యాయం చేశారు.
ప్రచార సమయంలో ప్రజల స్పందన ఎలా ఉంది?
ప్రకాశ్ గౌడ్ 15 సంవత్సరాల హయాంలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండలేదు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. దళిత బంధు, బీసీ బంధు, ఇతర అన్ని పథకాలు తన కార్యకర్తలు, నాయకులకే కట్టబెట్టుకున్నారు. ఎమ్మెల్యే కేవలం ఎన్నికలప్పుడే ప్రజల వద్దకు వస్తారు. మిగతా సమయంలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండరు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.
బీజేపీ అభ్యర్థి అయిన నాకు అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను కొంతకాలంగా ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. జనం కుల, మతాలకు అతీతంగా బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. కేంద్రంలో ప్రధాన మంత్రి మోడీ ప్రజా సంక్షేమం కోసం ఎన్నో అద్భుతమైన పథకాలను కొనసాగిస్తున్నారు. అవి అందరికీ అందుతున్నాయి. కరోనా టీకాలు, ఇతర గొప్ప పథకాలు దేశ ప్రజలందరికీ అందాయి.
ప్రస్తుత ఎమ్మెల్యే కబ్జాలు చేశారంటున్నారు? నిజమేనా?
ప్రస్తుత ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఎన్నో భూములను కబ్జా చేశారు. ఆయన అనుచరులు స్వాహా చేశారు. మణికొండ, నార్సింగి, శంషాబాద్, సుల్తాన్ పల్లి, సింప్లెక్స్ తదితర ప్రాంతాల్లో విలువైన భూములను ఎమ్మెల్యే అనుచరులు ఆక్రమించారు. రాత్రికిరాత్రి దొంగ పత్రాలు సృష్టించారు. అత్తాపూర్‌లో కోట్లు విలువచేసే ఎండోమెంట్ భూములు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అనుచరులు కబ్జా చేశారు. భూములు కబ్జా అవుతున్నా మరి ఆయన ఎందుకు స్పందించలేదు? ఆయన హస్తం ఉంది కాబట్టే చర్యలు తీసుకోలేదు. ఆయన తన అనుచరులను ముందుంచి కబ్జా చేశారు. ఒకవేళ ఆయన కబ్జాల్లో లేకపోతే అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు. కబ్జాలను ఎందుకు అడ్డుకోలేదు? ఆయన అండదండలతోనే కబ్జాలు జరిగాయి.
బీజేపీ సీనియర్లు, ఎమ్మార్పీఎస్ నేతల మద్దతు ఎలా ఉంది?
బీజేపీ సీనియర్ నేతలు, ఎమ్మార్పీఎస్ నేతల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఎప్పటికప్పుడు సీనియర్ల నుంచి సలహాలు తీసుకుంటున్నా. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ నేతలు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. అన్ని వర్గాల మద్దతుతో ఈసారి 50వేల మెజారిటీతో విజయం సాధిస్తా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. బీజేపీ నేతలు, కార్యకర్తలు, నాయకులు తనను గెలిపించేందుకు నిరంతరంగా శ్రమిస్తున్నారు.
కార్పొరేటర్‌గా ఏం అభివృద్ధి చేశారు?
రెండుసార్లు మైలార్దేవ్ పల్లి కార్పొరేటర్‌గా పనిచేశా. జీహెచ్ఎంసీ నుంచి రూ.103 కోట్ల నిధులను తీసుకొచ్చి పలు అభివృద్ధి పనులు చేపట్టాను. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, కమ్యూనిటీ హాల్స్ ఇలా ఎన్నో రకాల పనులు చేశా. 144 కిలోమీటర్ల మంచినీటి పైపు లైన్లు వేయించా. ఆర్‌బీకే లోన్లకు సంబంధించి బ్యాంకు అధికారులతో మాట్లాడి వాటిని 50 శాతానికి తగ్గించి చెల్లించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నా.
కరోనా సమయంలో మీ పాత్ర ఏమిటి?
కరోనా మహమ్మారి సమయంలో ఎంతో మందిని ఆదుకున్నా. 10 వేల కుటుంబాలకు రేషన్ సరుకులు అందజేశా. కొన్ని వేలమంది కరోనా బాధితులకు భోజనం అందించా. ఎంతోమందికి చేయూతనిచ్చా. కష్టంలో ఉన్నానని ఎవరు వచ్చినా ఇప్పటివరకు వేలాదిమందికి సహాయం చేశా. ఎంతో మంది నిరుపేదలకు ఆపద్బాంధవుడిలా కష్టాల్లో నిలిచా.
ఎంఐఎం ప్రభావం ఎలా ఉండనున్నది?
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎంఐఎం ఎన్నో కుట్రలకు పాల్పడుతుంది. పార్టీ అధినేత ఉద్దేశపూర్వకంగా హిందూ వ్యక్తిని అభ్యర్థిగా నిలిపారు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా ఇక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. సమీప భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజనలో శాస్త్రి పురం నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీ కుట్రలకు పాల్పడుతున్నారు.
అప్పుడు హిందూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో ఉంచుకోవాలి. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని ఎన్నో వేల విలువచేసే భూములను అమ్మి తన ఖజానా నింపుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అందులోనుంచి రూ.10 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అసమర్థుడు కావడంతో చేతకాని దద్దమ్మలా ఊరుకున్నాడు. నేను గెలిచిన తర్వాత ప్రత్యేక ప్రణాళికలతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా.
అమిత్ షా, మోదీ సభల స్పందన ఎలా ఉంది?
నన్ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదంతో 50 వేల మెజారిటీతో విజయం సాధిస్తా. రాజేంద్రనగర్ గెలుపుపై కేంద్ర పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. అమిత్ షా రోడ్ షో భారీగా సక్సెస్ అయింది. మేము ఊహించిన దాని కంటే కూడా ఎక్కువ జనం వచ్చారు. బ్రహ్మరథం పట్టారు. రెండుసార్లు ఎన్ఐఏ దాడుల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉగ్రవాదులు దొరికారు.
వారికి బీఆర్ఎస్, ఎంఐఎం సపోర్టు ఉంది. ఉగ్రవాదుల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కాలనీ, బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాల్లో జనం నుంచి అపూర్ణ స్పందన వస్తుంది. నా గెలుపు ఇక లాంఛనమే. కేవలం ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వస్తున్నారని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయనను సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారు.






