ఘనంగా ప్రారంభమైన 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్ 2026

by Ajay Maddhiboyina |

రాష్ట్ర పోలీస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026” శుక్రవారం సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఘనంగా ప్రారంభమైన 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్ 2026
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పోలీస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026” శుక్రవారం సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సైబరాబాద్ సీపీ ఎం రమేష్ ఆధ్వర్యంలో క్రీడా జ్యోతిని డీజీపీ వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. పోలీస్ లాంఛనాల మధ్య గన్ ఫైర్ చేసి, గాలిలోకి బెలూన్లు ఎగురవేసి పోటీలకు శ్రీకారం చుట్టారు. డీజీపీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో గ్లోబల్ సమ్మిట్, అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు, సమ్మక్క-సారక్క జాతర వంటి కీలక బాధ్యతలను పోలీసులు సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో బిజీగా ఉన్నప్పటికీ క్రీడల్లో పాల్గొనడం సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని పేర్కొన్నారు.

క్రీడలు నాయకత్వ లక్షణాలు, టీమ్ స్పిరిట్, ఐకమత్యాన్ని పెంచుతాయని, గెలుపోటముల కంటే క్రీడాస్ఫూర్తి ముఖ్యమని స్పష్టం చేశారు. మహిళా పోలీసుల ప్రాతినిధ్యం ప్రతి విభాగంలో పెరగాలని పిలుపునిచ్చారు. సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 2,532 మంది క్రీడాకారులు పాల్గొనడం గర్వకారణమన్నారు. ఇందులో 300 మంది మహిళా క్రీడాకారులు ఉండటం విశేషమన్నారు. మొత్తం 31 క్రీడా విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయని, మహిళలకు 14 ఈవెంట్స్ కేటాయించామని తెలిపారు. జాతీయ స్థాయి విజేతలకు గోల్డ్‌కు రూ.3 లక్షలు, సిల్వర్‌కు రూ.2 లక్షలు, బ్రాంజ్‌కు రూ.1 లక్ష నగదు ప్రోత్సాహకంతో పాటు ఇంక్రిమెంట్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. క్రీడలపై ముఖ్యమంత్రి ఉన్న ప్రోత్సాహంతో మహ్మద్ సిరాజ్ , నికిత్ జరీన్ వంటి క్రీడాకారులను నేరుగా డీఎస్పీలుగా నియమించడం శాఖకు గర్వకారణమన్నారు. అనంతరం అంతర్జాతీయ వేదికలపై రాణించిన పి. కృష్ణారావు, డి. సంజీవ్ కుమార్, గోపాల్ కృష్ణ, ఎం.డి. బాబా, అవెను గోపాల్, ఎస్. జయరాం (అర్జున అవార్డు గ్రహీత), కె. లావణ్యలను పతకాలతో సన్మానించారు.

ప్రత్యేక ఆకర్షణగా పోలీస్ ఎక్స్ పో..

ఈ క్రీడా పోటీలను పురస్కరించుకొని పోలీస్ వెల్ఫేర్ అండ్ వెల్నెస్ లో భాగంగా సైబరాబాద్ కమీషనరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎక్స్ పో ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సతీమణి హేమ శివధర్ రెడ్డి ప్రారంభించారు. పోలీసులకు ఉపయోగపడే.. ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, శారీరక వ్యాయామ, క్రీడా పరికరాలు, వివిధ ఉత్పత్తుల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన పట్ల పోలీస్ సిబ్బంది, క్రీడాభిమానులు, సందర్శకులు విశేష ఆసక్తి కనబరుస్తున్నారు. జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తోంది. ఖైదీలు ఏర్పాటు చేసిన డోర్ మ్యాట్ లు, ఫ్లోర్ క్లీనర్ లు, టవల్స్, బెడ్ షీట్లు, కలపతో తయారు చేసిన హస్త కళాకృతులు, నిత్యజీవితంలో రోజువారీ ఉపయోగించే వస్తువులు కుర్చీలు, మొబైల్ స్టాండ్లు, మహిళా ఖైదీలు తయారుచేసిన సరికొత్త డిజైన్ గాజులు, బ్యాగులు తదితర వస్తువులు స్టాల్లో కొలువయ్యాయి.

ఈ కార్యక్రమంలో ప్రిజన్స్ అండ్ కరెక్షన్స్ సర్వీసెస్ డీజీ సౌమ్య మిశ్రా, , డీజీ ఫైర్ సెఫ్టీ విక్రమ్ సింగ్ మాన్ , ఏడి‌జి‌పి లా అండ్ ఆర్డర్ మహేశ్ మురళీధర్ భగవత్, ఏడి‌జి‌పి ఆపరేషన్స్ గ్రే హౌండ్స్ అండ్ ఆక్టోపస్ డాక్టర్ అనిల్ కుమార్, ఏడి‌జి‌పి ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్, ఓఎస్డీ, ఐఎస్ డబ్ల్యూ వీబీ కమలాసన్ రెడ్డి, పీఅండ్ ఎల్, స్పోర్ట్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఐజీ డాక్టర్ గజరావు భూపాల్, ఐజీ మల్టీ జోన్ – Iఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ సుమతి, త్రిపుర ఐజీ ఆవుల రమేశ్ రెడ్డి, సైబరాబాద్ డి‌సి‌పిలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story