- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్కులు ఆక్రమించి ఇళ్ల నిర్మాణం.. హైడ్రాకు ఫిర్యాదు
కాలనీల నుంచి అధిక మొత్తంలో ఫిర్యాదులు వస్తున్నాయి. లే అవుట్ వేసినప్పుడు చూపించిన పార్కులు తర్వాత ప్లాట్లుగా మారిపోతున్నాయని పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాలనీల నుంచి అధిక మొత్తంలో ఫిర్యాదులు వస్తున్నాయి. లే అవుట్ వేసినప్పుడు చూపించిన పార్కులు తర్వాత ప్లాట్లుగా మారిపోతున్నాయని పలువురు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రహదారికి ఇరువైపులా ప్లాట్లు కొనడం.. మధ్యలో రహదారిని మాయం చేయడం లే అవుట్లలో పరిపాటిగా మారింది. బాగ్ హయత్‌నగర్ జగదాంబా కాలనీలో విజయవాడ హైవే వైపు తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసి కిరాయిలు వసూలు చేస్తున్నారు. జగదాంబా కాలనీ - పక్కనే ఉన్న బీడీఎల్ కాలనీని కలిపే రహదారికి అడ్డంగా గోడ కట్టి తాత్కాలిక షెడ్డులు ఏర్పాటు చేశారని ఫొటోలతో సహా ఫిర్యాదు చేశారు. అమీన్‌పూర్ మండలం, విలేజ్‌లోని ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లే అవుట్ ఆక్రమణలకు గురి అవుతోందని.. పాత లేఅవుట్‌ను పట్టించుకోకుండా రహదారులు, పార్కులు ఆక్రమించి ఇళ్లు కట్టేస్తున్నారని సొసైటీ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఉప్పల్ ఈస్ట్ కళ్యాణపురిలోని జీహెచ్ఎంసీ పార్కులో జీ+ 2 భవనాన్ని కట్టారని అక్కడి సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది.
తుర్కయాంజల్ మున్సిపాలిటీ నీలద్రినగర్ కాలనీ ఫేజ్ -2 లో రహదారులు ఆక్రమణకు గురయ్యాయని, కాప్రా విలేజ్‌లోని జై జవాన్ కాలనీ 333 ప్లాట్లతో వెలసి.. 7 చోట్ల ప్రజావసరాలకు కేటాయించిన స్థలాల్లో 6 చోట్ల పార్కులు, ప్రజల వినియోగంలో ఉన్నా.. 7వ స్థలంలో ప్లాట్లు మూడు వెలిసాయని వెంటనే వాటిని తొలగించాలని ప్రజావాణి ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, గండిమైసమ్మ–దుండిగల్ మండలం, బౌరంపేట్ గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు అక్కడి స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని బౌరంపేట్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కోసం ఈ భూమిని కేటాయించాలని కోరారు. ఇలా వివిధ ఆక్రమణలపై హైడ్రా ప్రజావాణికి మొత్తం 46 ఫిర్యాదులు రాగా.. హైడ్రా అదనపు కమిషనర్ ఆర్.సుదర్శన్ విచారించి.. పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు.






