- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓఆర్ఆర్ టూ త్రిపుల్‌ఆర్‌కు రాచమార్గం
రావిర్యాల్ (టాటా ఇంటర్‌చేంజ్) ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆమన్‌గల్ (రతన్ టాటా రోడ్) ప్రాంతీయ రింగ్ రోడ్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణంతో రయ్.రయ్ మంటూ వెళ్లొచ్చు.

దిశ, తెలంగాణ బ్యూరో : రావిర్యాల్ (టాటా ఇంటర్‌చేంజ్) ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆమన్‌గల్ (రతన్ టాటా రోడ్) ప్రాంతీయ రింగ్ రోడ్ వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణంతో రయ్.రయ్ మంటూ వెళ్లొచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధికి తోడ్పడేందుకు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వద్ద రావిర్యాల్ (టాటా ఇంటర్‌చేంజ్) నుంచి ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్ రోడ్ (త్రిపుల్ ఆర్) ఆమన్‌గల్ (రతన్ టాటా రోడ్) వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్–1 నిర్మాణాన్ని చేపట్టడానికి చర్యలు ప్రారంభించింది.
41.50 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు..
మొదటి దశలో రావిర్యాల్ టాటా ఇంటర్‌చేంజ్ (ఓఆర్ఆర్) నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు 19.20 కి.మీ, రెండో దశ మీర్‌ఖాన్ పేట్ నుంచి ఆమన్‌గల్ వరకు 22.30కి.మీ రోడ్డు నిర్మించనున్నారు. 100 మీటర్లు (పాక్షిక యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే), 3+3 లేన్ మెయిన్ క్యారేజ్ వే (భవిష్యత్తులో 4+4 లేన్లకు విస్తరించడానికి అవకాశం ఉండేలా), ప్రత్యేక మెట్రో/రైల్వే కారిడార్, గ్రీన్‌బెల్ట్స్, సైకిల్ ట్రాక్స్, ఫుట్‌పాత్‌లు, సర్వీస్ రోడ్లు ఉండేలా డిజైన్ చేశారు.
14 గ్రామాల్లోంచి..
గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు రెండు దశల్లో కలిపి 14 గ్రామాల గుండా వెళ్తుంది. ఓఆర్ఆర్ నుంచి మీర్‌ఖాన్ పేట్ వరకు నిర్మించే మొదటి దశ రోడ్డు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు మండలాల్లో కొంగర ఖుర్ద్, ఫీరోజ్‌గూడ, కొంగర కలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్‌ఖాన్‌పేట్ గుండా పోతుంది. రెండో దశ మీర్‌ఖాన్ పేట్ నుంచి ఆమన్‌గల్ వరకు యాచారం, కడ్తాల్, ఆమన్‌గల్ మండలాల్లోని కుర్మిద్ద, కడ్తాల్, ముద్విన్, ఆకుతోటపల్లి, ఆమన్‌గల్ గ్రామాల నుంచి పోతుంది.
రూ.4,621 కోట్లతో..
గ్రీన్ రేడియల్ రోడ్డును రూ.4,621 కోట్లతో నిర్మించడానికి టెండర్లు ఫైనల్ చేశారు. మొదటి దశ రోడ్డు నిర్మాణానికి రూ.1,911 కోట్లు (భూసేకరణతో సహా), రెండో దశ నిర్మాణానికి రూ.2,710 కోట్లు (భూసేకరణ సహా) అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టును 30 నెలల్లో పూర్తి చేయాలని హెచ్ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సుమారు 8.94 కి.మీ. రహదారి (236.89 ఎకరాలు/95.87 హెక్టార్లు) 7 రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌ల గుండా వెళ్తుంది. వీటికి సంబంధించిన అనుమతులు పరివేష్ పోర్టల్‌లో దరఖాస్తు చేసి పరిశీలనలో ఉన్నాయి. 7.69కి.మీ రోడ్డుతో పాటు ఇంటర్ ఛేంజ్‌లతో కలిపి దాదాపు 310 ఎకరాల టీజీఐఐసీ భూముల నుంచి వెళ్తుందని అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయింది.
గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుతో..
ఈ గ్రేన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు పూర్తయితే ఓఆర్ఆర్, త్రిపుల్‌ఆర్‌ను నేరుగా కలిపి, దక్షిణ జిల్లాలకు ప్రయాణ సమయం తగ్గుతుంది. ప్రస్తుత మార్గాలపై రద్దీ తగ్గుతుంది. భవిష్యత్తులో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ (మెట్రో/రైలు)కు సౌకర్యంగా ఉంటుంది. పరిశ్రమలు, ఐటీ హబ్‌లు, ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఈ-సిటీ, ప్రాంతీయ మార్కెట్లకు వేగవంతమైన రవాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. రహదారి ద్వారా హైదరాబాద్ నుంచి రాబోయే ఫ్యూచర్ సిటీకి సులభ రవాణా ఐటీ పార్కులు, పరిశోధనా కేంద్రాలు, ఆధునిక నివాస సముదాయాలకు అనుసంధానంగా మారనుంది. స్కిల్ యూనివర్సిటీ, సమీప పరిశ్రమల మధ్య సులభ రవాణా, ఔషధ, ఎలక్ట్రానిక్స్, ఐటీ, అనుబంధ రంగాల్లో లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఉపాధి నిర్మాణ దశలో ఉపాధి సృష్టి, ప్రాజెక్ట్ పూర్తయ్యాక ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి కూడా పెరగనుంది. సైకిల్ ట్రాక్స్, గ్రీన్‌బెల్ట్స్, ఫుట్‌పాత్‌లు, భవిష్యత్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కు సౌకర్యం– పర్యావరణహిత రవాణ సౌకర్యాలతో సుస్ధిర రవాణ వ్యవస్థగా మారనుంది.
ఈ-సిటీ లింక్‌తో సెమీకండక్టర్, హార్డ్‌వేర్ ఉత్పత్తి పరిశ్రమలకు సులభ రవాణా, ఎగుమతులకు ప్రోత్సాహం, ‘మేక్ ఇన్ తెలంగాణ’ లక్ష్యానికి బలాన్నిస్తుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్ణీత సమయానికి పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది. పర్యావరణహిత, సుస్థిర మౌలిక వసతులను అందించడం ద్వారా ప్రాంతీయ రవాణా అవసరాలను తీర్చడానికి కృషి చేస్తుంది. రేడియల్ రోడ్లతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలను కలిపే కొత్త ఈస్ట్-వెస్ట్ ట్రంక్ రోడ్డు నిర్మిస్తారు. టోల్ ఫీజు లేకుండా వేగవంతమైన ప్రయాణానికి సింగిల్-ఫ్లో మార్గాలను ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మెట్రో ఫేజ్ 2–బికి అనుసంధానం చేయనున్నారు.
నేడు శంకుస్థాపన..
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు. దీంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.






