- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పాలిటెక్నిక్’లో పెరగనున్న 4వేల సీట్లు!
మారుతున్న కాలానికి, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే జూన్ లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం (2026-27) నుంచి కొత్త కోర్సులు, కొత్త సిలబస్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వేగవంతం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : మారుతున్న కాలానికి, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే జూన్ లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం (2026-27) నుంచి కొత్త కోర్సులు, కొత్త సిలబస్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వేగవంతం చేసింది. ఇప్పటివరకు వాటికి సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతులు 50 శాతం పైనే పూర్తయినట్లు ఎస్బీటెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా వచ్చే విద్యా సంవత్సరం నుండి రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో సుమారు నాలుగు వేల అదనపు సీట్లు అందుబాటులోకి తీసుకురానుంది.
ఎమర్జింగ్ టెక్నాలజీస్‌కు పెద్దపీట
పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా సుమారు 12 కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. వీటిలో ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ (ఉద్భవిస్తున్న సాంకేతికతలు) కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోర్సును తెలంగాణ ఏవియేషన్ అకాడమీతో ఎంఓయూ కుదుర్చుకుని నడపనున్నారు. సెమీకండక్టర్ టెక్నాలజీ, అడ్వాన్స్ డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాల్యుయేషన్, ల్యాండ్ స్కేప్ డిజైన్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, కన్ స్ర్టక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్, సివిల్ ఇంజినీరింగ్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్ తదితరు కొత్త కోర్సులు వచ్చే కొత్త విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.
పాఠ్యప్రణాళికలో ఏఐ
వచ్చే ఏడాది నుంచి ప్రతి పాలిటెక్నిక్ విద్యార్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశంపై పట్టు సాధించేలా సిలబస్‌ను రూపొందించారు. ఇందులో భాగంగా ఒక ప్రత్యేక థియరీ సబ్జెక్టును ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగాత్మక పరిజ్ఞానం కోసం ఒక ల్యాబ్ సెషన్‌ను కూడా తప్పనిసరి చేయనున్నారు. ఫస్టియర్ లో అమలవుతున్న సెమిస్టర్ విధానంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఫస్టియర్ లో వార్షిక పరీక్షల విధానాన్ని వచ్చే ఏడాది నుండి అమలు చేయనున్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టడంతోపాటు, ఇప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతమున్న కొన్ని కోర్సుల పేర్లను మార్చడంతోపాటు అన్నికోర్సుల సిలబస్ ప్రక్షాళన చేస్తున్నారు. రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి, ఐఐటీ హైదరాబాద్ నిపుణులు, భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), టాటా టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులు, పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసి కొత్త కోర్సులతోపాటు, కొత్త సిలబస్ రూపొందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పాలిటెక్నిక్ విద్యార్థుల్లో ఏటా సగటున 60 నుండి 75 శాతం వరకు ఉత్తీర్ణత నమోదవుతుంది. కొత్త కోర్సులు, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల రానున్న రోజుల్లో ఈ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.






