ఎల్లంపల్లి 40 గేట్లు ఓపెన్!

by Ajay Maddhiboyina |

విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. అటు కృష్ణా.. ఇటు గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం నిండుగా కనిపిస్తున్నాయి.

ఎల్లంపల్లి 40 గేట్లు ఓపెన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. అటు కృష్ణా.. ఇటు గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం నిండుగా కనిపిస్తున్నాయి. మొన్నటివరకు కృష్ణా బేసిన్ పరిధిలో కురిసిన వర్షాలకు అక్కడి ప్రాజెక్టులన్నీ ఫుల్ అవ్వగా.. తాజాగా గోదావరి బేసిన్ పరిధిలో కురుస్తున్న వర్షాల వలన వరద భారీ స్థాయిలో పోటెత్తుతోంది. ముందుగా మంచిర్యాల జిల్లా పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతున్నది. అదే స్థాయిలో ఔట్ ఫ్లో సైతం ఉండటంతో మిడ్ మానేరు, ఎల్ఎండీ ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉన్నాయి.

ఎస్సారెస్పీ, ఎల్లంపల్లికి భారీగా ఇన్ ఫ్లో..

ఉత్తర తెలంగాణ పరిధిలోని మేజర్ ప్రాజెక్టులైన ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. గురువారం ఎస్సారెస్పీకి ఇన్ ఫ్లో 1,75,000 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 2,83,992 క్యూసెక్కులుగా ఉంది. ఇక ఎల్లంపల్లికి సంబంధించి ఇన్ ఫ్లో 7,30,630 క్యూసెక్కులు కాగా.. 8,07,742 ఔట్ ఫ్లో ఉంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లను అధికారులు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు.. ఎస్సారెస్పీ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండగా.. గ్రావిటీ ద్వారా మిడ్ మానేరుకు నీరు చేరుతున్నది. అలాగే, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు వరద వచ్చి చేరుతున్నది. మిడ్‌మానేరుకు ప్రస్తుతం 75,375 ఇన్ ఫ్లో కొనసాగుతుండగా.. 57,042 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. దీంతో ఎల్ఎండీకి భారీ స్థాయిలో వరద వస్తున్నది. 55,829 క్యూసెక్కుల భారీ ఇన్ ఫ్లో వస్తుండటంతో నేడు(శుక్రవారం) ఎల్ఎండీ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు. అటు ఎగువ మానేరు నుంచి సైతం 85వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఎల్ఎండీకి వస్తున్నది. మరోవైపు.. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌కు మోటార్స్ ద్వారా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. రోజూ 9 వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తుండటంతో మరో ఐదారు రోజుల్లోనే ఈ ప్రాజెక్టులు సైతం పూర్తిస్థాయిలో నిండనున్నాయని అధికారులు చెబుతున్నారు. అటు.. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు సైతం ఇప్పటికే నిండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జూన్ నెలలోనే అక్కడి ప్రాజెక్టులు ఫుల్ అయ్యాయి. గతేడాది శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో అంతంత మాత్రంగానే నీరు ఉంటే.. ఈ సారి మాత్రం భిన్నంగా వరదతో నిండిపోయాయి.

నిండిన చెరువులు.. కొన్నింటికి గండ్లు..

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు సైతం నిండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 34,700 చెరువులు ఉండగా.. వాటిలో 95 శాతానికి పైగా నిండినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వందకు పైగా చెరువులకు గండ్లు పడ్డాయి. వరదలు తగ్గుముఖం పట్టాక వాటికి రిపేర్ చేయాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే, కామారెడ్డి జిల్లా పరిధిలోని పోచారం ప్రాజెక్టుకు భారీ బుంగ పడింది. ఈ ప్రాజెక్టును గురువారం ఈఎన్సీ (ఓఅండ్ఎం) శ్రీనివాస్ సందర్శించారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగానూ అన్ని ప్రాజెక్టులు, చెరువులు, ఇతర జలాశయాలు నిండిపోవడంతో ఈసారి రెండు పంటలకూ నీటి ఢోకా లేదని అధికారులు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే..

ప్రాజెక్టు ఇన్ ఫ్లో ఔట్ ఫ్లో (క్యూసెక్కులు)

ఎల్లంపల్లి 7,30,630 8,07,742

శ్రీరాంసాగర్ 1,75,000 2,83,992

నిజాంసాగర్ 1,80,109 2,20,256

ఎగువమానేరు 77,457 77,457

మిడ్‌మానేరు 75,375 57,042

ఎల్ఎండీ 55,829 269

సింగూరు 37,685 40,113

కడెం 44,160 41,022

మేడిగడ్డ 4,51,920 4,51,920

సమ్మక్కసాగర్ 4,60,340 4,60,340

సీతమ్మసాగర్ 7,02,712 7,02,712

శ్రీశైలం 2,62,912 3,18,369

నాగార్జునసాగర్ 2,50,432 2,50,432

జూరాల 1,65,000 1,85,205

Next Story