- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనార్టీ సంక్షేమానికి రూ.3,769 కోట్లు.. విద్య, ఉపాధికే ప్రాధాన్యం!
తెలంగాణ బడ్జెట్ 2026-27లో మైనార్టీ సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.3,769 కోట్లు కేటాయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు పెంచుతూ అనేక సంక్షేమ పథకాలను అందజేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ పరిశీలిస్తే 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,003 కోట్లు కేటాయించారు. 2025–26లో రూ. 3,591 కోట్లను కేటాయించగా, ఈ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,769 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ. 178 కోట్లు పెరిగాయి. ఈ కేటాయింపుల్లో ప్రధానంగా విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, స్కాలర్‌షిప్‌లు, మహిళా సంక్షేమ పథకాలు, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి రుణాలు, విద్య, హజ్ సదుపాయాలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు నిధులపై ప్రభుత్వ దృష్టి సారించింది. ఈ ఏడాదిలో బడ్జెట్ కేటాయింపులను ఆయా రంగాలను పరిశీలిస్తే ప్రధానంగా ఈ ఏడాది కొత్తగా తెలంగాణ మైనార్టీల రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, వంటశాలల ఆధునీకరణ కోసం రూ. 25 కోట్లను కేటాయించారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు ఇంటర్మీడియట్ నుంచి పీజీ స్థాయి వరకు వృత్తివిద్యాకోర్సుల్లో చదివే వారి కోసం రూ.120 కోట్లు, ఇంటర్మీడియట్ నుంచి పీజీ స్థాయి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 100 కోట్లను కేటాయించారు. దీని ద్వారా 66వేల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నట్లుగా అధికారులు తెలిపారు. దీంతోపాటుగా మైనార్టీల సీఎం విదేశీ విద్యా పథకానికి రూ. 130 కోట్లు, తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్‌కి రూ. 4 కోట్లు, రాజీవ్ యువ వికాసానికి రూ. 790 కోట్ల నిధులను బడ్జెట్‌లో పేర్కొన్నారు.
విభిన్న పథకాల అమలు..
రాష్ట్రంలో ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను అందిస్తోంది. ఫకీర్/దూదేకుల, బలహీన ముస్లిం వర్గాలకు మోపడ్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో అర్హులైన వారికి జీవనోపాధి కోసం మోపెడ్ల కొనుగోలు, లబ్ధిదారుడికి గరిష్టంగా ఒక లక్ష వరకు యూనిట్ ఖర్చుతో 500 మోపడ్లను పంపిణీ చేయనున్నారు. ఇక ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకం కింద మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కోసం వితంతువులు, అనాథలు, ఒంటరి మహిళలు/పెండ్లికాని మహిళలకు ఒక్కసారి గ్రాంట్‌గా రూ.50 వేలు ఆర్థిక సాయం 5వేలమందికి అందిస్తారు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద స్వయంఉపాధి కల్పన కోసం ఈ ఏడాది 26,008 కుట్టుమిషన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ-బైకుల పంపిణీ పథకం ద్వారా మైనార్టీ కార్పొరేషన్ తరఫున రూ.150 కోట్లతో 3,150 మంది యువతకు బైక్‌లు అందించనున్నారు. రాష్ట్రంలోని ముస్లింలు, బౌద్దులు, సిక్కులు, పార్శీలు, జైనుల వంటి మైనార్టీలకు విభిన్న రంగాల్లో ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
హజ్ యాత్రికులకు గుడ్‌న్యూస్..
హజ్ యాత్రకు సంబంధించి ఈ ఏడాది ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 4 కోట్లు కేటాయించింది. దాదాపు 7,000 మంది నమోదు చేసుకోగా ప్రతి యాత్రికుడిపై పడే అదనపు భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి యాత్రికుడికి రూ. 10 వేల రూపాయల ఉపశమనం కలుగనున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి.






