DGP: గత ఏడాది 3 వేల రోడ్డు ప్రమాదాలు.. యాక్సిడెంట్లపై డీజీపీ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో జీవితాలు ఆగం అవుతున్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణకు యువత ముందడుగు వేయాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు.

DGP: గత ఏడాది 3 వేల రోడ్డు ప్రమాదాలు.. యాక్సిడెంట్లపై డీజీపీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో జీవితాలు ఆగం అవుతున్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణకు యువత ముందడుగు వేయాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. గత సంవత్సరంలో సుమారు 3 వేల యాక్సిడెంట్లు జరగగా, అందులో 300 మంది మరణించారని, కుటుంబాలను కన్నీరు పెట్టనివ్వదని తెలిపారు. మద్యం తాగి నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి కారణాల వల్లనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ అవగాహనపై హైదరాబాద్ కమిషనర్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో చెపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రజలందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించడం దినచర్యగా చేసుకోవాలన్నారు. 'అరైవ్ అలైవ్' సందేశాన్ని ప్రతి ఒక్కరు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలాంటి వాతావరణ పరిస్థితిలలోనైనా, విపత్తులలోనైనా హైదరాబాద్ పోలీసులు ఫ్రంట్‌లైన్‌లో ఉండి పోరాడుతున్నారని ప్రశంసించారు. దేశంలోనే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు మంచి పేరు ఉందన్నారు. ముఖ్యంగా, అవయవాలను తరలించడంలో (గ్రీన్ ఛానెల్) ముందున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహన కలిగించేందుకు సినీ ప్రముఖులను ఆహ్వనించారు.

మాకు మాత్రం శోకం మిగిలింది: బాబు మోహన్

సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడు, సినీ నటుడు కోట శ్రీనివాస రావు కుమారుడు ఇద్దరూ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారని గుర్తు చేశారు. రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఈ ఘటన బాధిస్తుందని మీ కుటుంబాలకు అలాంటి పరిస్థితి రానివ్వకూడదని తెలిపారు. కోట శ్రీనివాస రావుతో కలిసి ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులని నవ్వించామని మా కుటుంబాలకు రోడ్డు ప్రమాదాల రూపంలో శోకం మిగిలిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించే విషయంలో పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని సినీ డైరెక్టర్ బుచ్చిబాబు తెలిపారు. కారు నడిపే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ వేసుకోవాలని డైరెక్టర్ సుకుమార్ తనతో సీట్ బెల్ట్ వేసుకోవాలని ప్రామిస్ చేయించుకున్నారని విషయం పంచుకున్నారు. ప్రతి ఒక్కరు భద్రత (సేఫ్టీ) నియమాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సినీ హీరోలు శర్వానంద్ , ఆది సాయి కుమార్, సినీ హీరోయిన్ అర్చన, గాయకులు నాగూర్ బాబు, మోహనా భోగరాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story