300 వార్డులు.. 3 గ్రేటర్లు: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) రెడీ!

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-10 01:59:42  IST  )

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR)ను మూడు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

300 వార్డులు.. 3 గ్రేటర్లు: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) రెడీ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR)ను మూడు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే జీహెచ్ఎంసీలోని 27 యూఎల్బీలను విలీనం చేయడంతోపాటు జీహెచ్ఎంసీని 300 వార్డులుగా పునర్విభజించింది. త్వరలోనే మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పేపర్‌వ ర్క్ మొత్తం సిద్ధం చేసుకున్నారు. నేటితో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగియనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత స్పెషల్ ఆఫీసర్ పాలన వి ధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుం ది. ఈనెల 11న రాష్ట్ర వ్యా ప్తంగా మున్సిపల్ ఎన్నికల పో లింగ్ ముగి సిన వెంటనే మూడు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉంది.

ముహూర్తం ఫిక్స్..

ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ని 12 జోన్లను విభజించనున్నారు. పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, రాజేంద్రనగర్, గోల్కొడ, శంషాబాద్ జోన్లతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కొనసాగనుంది. కొత్తగా శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GCMC), మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో గ్రేటర్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (GMMC)లను ఏర్పాటు చేయనున్నారు.

స్పెషల్ ఆఫీసర్‌గా జయేశ్ రంజన్..

జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు మంగళవారంతో ముగియనుండడంతో స్పెషల్ ఆఫీసర్ పాలన ప్రారంభం కానుంది. 2053 చదరపు కిలోమీటర్ల పరిధిలోని జీహెచ్ఎంసీకి స్పెషల్ ఆఫీసర్‌గా స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్‌ను నియమించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే జయేశ్ రంజన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా కొనసాగుతున్నారు.

నేటితో ముగియనున్న పాలకవర్గం గడువు

జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు మంగళవారం సాయంత్రం 5గంటల తర్వాత ముగియనుంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి నేతృత్వంలో జీహెచ్ఎంసీ పాలకవర్గం 10 ఫిబ్రవరి 2021లో కొలువు దీరింది. ఐదేండ్లలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఐదేండ్ల కాలంలో 15 కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. 150 మంది కార్పొరేటర్లతో కొలువైన పాలకమండలి దిగిపోయే నాటికి బలం 144గా మిగిలింది. ఇద్దరు కార్పొరేటర్లు మహ్మద్‌ముబీన్, మాజిద్‌హుస్సేన్‌ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దేవర కరుణాకర్, షాహీన్‌బేగం, ముజాఫర్‌హుస్సేన్, వంగా మధుసూదన్‌రెడ్డి మృతి చెందారు.

మున్సిపల్ కార్పొరేషన్లకు ఆఫీసులు రెడీ..

టీసీయూఆర్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న రెండు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఆఫీసులు రెడీ చేస్తున్నారు. మాదాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ (NCA) భవనంలో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసును ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెన్నోవేషన్ పనులు జరుగుతున్నాయి. అప్పటి వరకు తాత్కాలికంగా మణికొండ మున్సిపల్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నారు. తార్నాకలోని పాత హెచ్ఎండీఏ ఆఫీసులో గ్రేటర్ మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (GMMC) ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కమిషనర్ చాంబర్, సెక్షన్లకు సంబంధించిన క్యాబిన్లతోపాటు కంప్యూటర్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇక పాత ఆఫీసులోనే జీహెచ్ఎంసీ కొనసాగనుంది.

Next Story