- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
18 రోజుల్లో 2.83 లక్షల ట్యాంకర్ బుకింగ్స్.. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల డిమాండ్ రెండింతలైంది. మాదాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో బుకింగ్స్ వస్తున్న నేపథ్యంలో నీటి పొదుపు, రెడ్ ట్యాంకర్ల సరఫరాపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అత్యధిక జనాభా, బహుళా అంతస్తుల భవనాలు ఉన్న ఏరియాలైన ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్, మణికొండ, కూకట్ పల్లి డివిజన్ లలోనే అత్యధికంగా ట్యాంకర్లు బుకింగ్ అవుతున్నాయని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. శనివారం ఖైరతాబాద్ లోని జలమండలి బోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు ఎన్. పంకజ, అశోక్ సామ్రాట్, సంతోష్ లతో కలిసి ఆయన మాట్లాడారు. ఎండకాలం రాగానే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతుందని, రికార్డు స్థాయిలో బుకింగ్ లు వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2021 జనవరి, ఫ్రబవరి మాసాల్లో సుమారు 52 వేల వాటర్ ట్యాంకర్ బుకింగ్ లు రాగా, 2026 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అది కాస్త లక్షా 8 వేలకు పెరిగి, రెండింతలైందని ఆయన వివరించారు. ఒకే సారి కొన్ని ప్రాంతాల నుంచి వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ వస్తుండటంతో గతేడాది తాము స్టడీ నిర్వహించి, వాస్తవాలను గుర్తించామన్నారు. ఈ ఆరు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతోపాటు హైరైజ్డ్ బిల్డింగ్స్ వస్తున్నాయని తెలిపారు. హాస్టళ్లు వంటివి ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. చాలా ప్రాంతాల్లో కేవలం వంద చదరపు గజాల స్థలంలో ఆరేడు అంతస్తులు నిర్మించి, వాటిని హాస్టళ్లుగా వినియోగిస్తున్నారని, అక్కడ అవసరాలకు తగిన విధంగా డైలీ ట్యాంకర్ల బుకింగ్ లు వస్తూ డిమాండ్ పెరుగుతుందన్నారు.
జలమండలికి సుమారు 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 12 వేల కిలోమీటర్ల పొడువున పైప్ లైన్ వ్యవస్థ ద్వారా దాదాపు 14.50 లక్షల మందికి మంచినీటిని సరఫరా చేస్తున్నామని అశోక్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ మాసంలోని గడిచిన 18 రోజుల్లో సుమారు 2 లక్షల 83 వేల ట్యాంకర్ బుకింగ్ లు వచ్చాయని, వీటిలో దుర్గం చెరువు ప్రాంతం నుంచి గతేడాది ఇదే నెలలో 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 1900 బుకింగ్ లు రాగా ఈ సారి ఆ సంఖ్య 2400 కు పెరిగిందని, అలాగే మణికొండలో గత సంవత్సరం ఇదే తేదీ నాటికి 690 ఉండగా, ఇపుడు ఆ సంఖ్య వెయ్యికి పెరిగిందని ఎండీ వివరించారు. వచ్చిన బుకింగ్ లలో 10 నుంచి 15 శాతం బుకింగ్ లు కేవలం నాలుగు ప్రాంతాల నుంచే వచ్చినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం జలమండలిలో దాదాపు 86 వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు, 1125 వాటర్ ట్యాంకర్లున్నట్లు ఆయన తెలిపారు. 2021 నుంచి అవసరానికి తగిన విధంగా, డిమాండ్ ను బట్టి ఫిల్లింగ్ స్టేషన్లు, వాటర్ ట్యాంకర్ల సంఖ్య ను పెంచుతూ వస్తున్నట్లు ఆయన వివరించారు.
పొదుపుగా వాడుకోండి..
వేసవి కాలంలో ఈ 45రోజులు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నదని, నీటిని పొదుపువాడుకోవాలని ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. 20శాతం నీటిని పొదుపు చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది సైతం ఎండలు తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారని, ఇప్పటి నుంచే నీటి వృధాను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే పానీ యాప్ ఆదివారం నుంచి మళ్లీ ప్రారంభమవుతోందని, ప్రజలు సహకరించాలని కోరారు.
రెడ్ ట్యాంకర్ల ద్వారా ఎస్టీపీ వాటర్..
ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన వాటర్ ను రెడ్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నామని తెలిపారు. పరిశ్రమలు, ల్యాండ్ స్పేపింగ్, గార్డెన్లకు సరఫరా చేయడం ద్వారా జలమండలి ద్వారా సరఫరా చేస్తున్న నీటిపై ఒత్తిడి తగ్గనుందని తెలిపారు. ఎస్టీపీ సమీపంలో కంపెనీలకు పైపులైన్ ద్వారా సరఫరా చేయడానికి జలమండలి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే పలు కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు.
ఇంకుడు గుంతలు తప్పనిసరి..
ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. 45రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఇంకుడు గుంత ఏర్పాటు చేస్తేనే ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుుంటుందని చెప్పారు. ఇప్పటికే 750ప్రాంతాల్లో జలమండలి ఆధ్వర్యంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నామని, 12వేల ఇంకుడు గుంతలను నిర్మించినందుకుగాను కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చిందని గుర్తుచేశారు.






