ఒరేయ్ బాబూ అది ఆటోనా.. పుష్పక విమానమా?

by Muthe.Rajitha |

సాధారణంగా ఒక ఆటోలో ముగ్గురు లేదా నలుగురు ప్రయాణికులు ప్రయాణిస్తారు.

ఒరేయ్ బాబూ అది ఆటోనా.. పుష్పక విమానమా?
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ఒక ఆటోలో ముగ్గురు లేదా నలుగురు ప్రయాణికులు ప్రయాణిస్తారు. అది సెవెన్ సీటర్ ఆటో అయితే డ్రైవర్ తో సహా 8 మంది ప్రయాణిస్తారు. కానీ ఆటోలో ఏకంగా 23 మందిని ఎక్కించుకొని వెళ్తున్న ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ సోమవారం ఉదయం సాధారణ తనిఖీలు చేస్తుండగా.. ఆటో నిండా స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తున్న సెవెన్ సీటర్ ఆటో కనబడింది.

దానిని రోడ్డు పక్కన ఆపి చూడగా.. అందులో ఏకంగా 23 మంది స్కూల్ విద్యార్థులు ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు షాకయ్యారు. దీంతో ఆటో డ్రైవర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్ఐ కళ్యాణ్.. రెండు ఆటోలను రప్పించి, పిల్లలను తిరిగి ఇంటికి పంపించి వేశారు. చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆటో డ్రైవర్స్ కు వార్నింగ్ ఇస్తూ.. ఈ విషయంలో స్కూల్ యాజమాన్యాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అనుకోని ప్రమాదాలు జరిగితే తీవ్ర నష్టం జరుగుతుందని, ఆటోల్లో ఇష్టానుసారం పిల్లలని స్కూళ్లకు పంపవద్దని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు హితవు పలికారు. అయితే ప్రస్తుతం 23 మంది స్కూల్ విద్యార్థులను ఆటోలో నుంచి కిందకి దింపుతున్న వీడియో వైరల్ కావడంతో.. ఒరేయ్ బాబూ అది ఆటో అనుకున్నావా? పుష్పక విమానం అనుకున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు అటు ఆటో డ్రైవర్ తోపాటు, స్కూళ్ల యాజమాన్యాలపై, తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై కూడా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story