- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
22 ఏళ్ల నాటి కొనుగోలు విధానానికి బ్రేక్.. 50 వేల కుటుంబాల ఉపాధికి ముప్పు!
తెలంగాణలో చేనేత వస్త్రాల కొనుగోలుకు ప్రభుత్వం తెచ్చిన కొత్త టెండర్ విధానంపై కార్మికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వస్త్రాల కొనుగోలుకు ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన టెండర్ల విధానం చేనేత సహకార సంఘాలను నిర్వీర్యం చేసేలా ఉంది. దీంతో ప్రైవేటు కంపెనీల పోటీని తట్టుకోలేక తాము రోడ్డున పడాల్సిన దుస్థితి దాపురించిందని కార్మికులు, మాస్టర్ వీవర్ల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. చేనేత కార్మికులను నిరంతరం పని కల్పించేందుకు గతంలో హైకో, ఆప్కో.. ఇప్పుడు టెస్కో వంటి మాతృ సంస్థలను రూపొందించారు. పవర్ లూం కార్మికులను సైతం ఆదుకునేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ శాఖలకు అవసరమయ్యే వస్త్రాలను అందించే ప్రక్రియను టెస్కో చేపట్టేది. చేనేత సొసైటీలకు ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ ఇచ్చేది. ప్రభుత్వ శాఖలకు అవసరమైన బెడ్డింగ్ మెటీరియల్ (లివరీ వెరైటీస్) పూర్తిగా చేనేత సంఘాల్లో ఉత్పత్తి చేసినవే వంద శాతం కొనుగోలు చేయాలని గతంలో పలు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఆ పద్ధతికి పూర్తిగా స్వస్తి పలుకుతున్నారు. ఇదిలాగే కొనసాగితే చేనేత వ్యవస్థ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2004 నుంచి..
చేనేత రంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రభుత్వ శాఖలకు కావాల్సిన కార్పెట్లు, బెడ్ షీట్లు, టవల్స్ వంటి ఉత్పత్తులను ఉమ్మడి రాష్ట్రంలో ఆప్కో (ప్రస్తుత టెస్కో) ద్వారా చేయించారు. ఆ తర్వాత ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలన్న నిబంధన అమలైంది. చేనేత పరిశ్రమను, ఆ రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు పథకాలను అమలు చేశాయి. అన్ని శాఖలకు అవసరమైన వస్త్రాల కొనుగోలుతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనతా వస్త్రాలను కూడా చేనేతకే కేటాయించారు. గత మార్చి వరకు చేనేత సొసైటీలకు ప్రోక్యూర్మెంట్ ఇచ్చారు. ఏప్రిల్ ఫస్ట్ నుంచి టెస్కోకు ఆర్డర్లు లేవంటున్నారు. దాని వల్ల చేనేత సొసైటీల నుంచి టెస్కో కూడా బెడ్ షీట్లు, టవల్స్, కార్పెట్లను కొనుగోలు చేయలేమని చేతులెత్తేస్తున్నది.
పోటీ పడలేక..
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు వస్త్రాలను అందించడం మాత్రమే చేనేత సొసైటీలు, కార్మికులకు సాధ్యం. అలా కాదని ఓపెన్ మార్కెట్ ద్వారా టెండర్లు ఆహ్వానిస్తే సొసైటీలేవీ పాల్గొనలేవు. ప్రైవేటు కంపెనీలే ఆర్డర్లను దక్కించుకునే అవకాశం ఉంటుంది. చేనేత సొసైటీలు రూ.360కి అందించే బెడ్ షీట్లను కంపెనీలు రూ.200లకైనా అందిస్తామని ముందుకొచ్చే చాన్స్ ఉంది. నిజానికి చేనేత మగ్గం మీద నేసిన బెడ్ షీట్లు కావడం వల్లే ధర అధికంగా ఉంటుంది. ప్రైవేటు కంపెనీలు పవర్ లూం మీద తయారు చేసి తక్కువ ధరకే అందించేందుకు ముందుకొస్తాయి. దాని వల్ల కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలకు గిరాకీ ఉండదు. దీంతో ఇప్పటికే అరకొరగా నడుస్తున్న చేనేత మగ్గాలు ఇంకా కుంటుపడే ప్రమాదముంది. 22 ఏండ్ల నుంచి నడుస్తున్న డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ విధానంపై కొందరు అధికారులు కుట్రలు సాగిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కొందరు ఐఏఎస్ అధికారులు ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేనేత రంగాన్ని కాపాడాల్సిన బాధ్యతను విస్మరిస్తూ తీసుకోబోతున్న ఈ నిర్ణయం కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.
సంఘం వినతి.. మంత్రి హామీ
ప్రభుత్వం ఇన్నాండ్లుగా చేనేత రంగాన్ని కాపాడేందుకు పథకాలు అమలు చేసింది. కానీ 2026–27 నుంచి టెస్కో ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయకుండా దొడ్డిదారి ఉత్తర్వులు తీసుకొచ్చారని కార్మికులు బాధ పడుతున్నారు. ప్రభుత్వ శాఖల నుంచి టెస్కోకు నేరుగా ఆర్డర్ ఇవ్వకుండా టెండర్ విధానాన్ని అమలు చేయించేందుకు కుట్ర సాగుతున్నది. దీని వల్ల చేనేత రంగంపై ఆధారపడిన 50 వేల మంది కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం నెలకొన్నది. ఇది అమలైతే కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కార్పెట్లు, బెడ్ షీట్స్, టవల్స్ వస్త్రాలు ఉత్పత్తి చేసే చేనేత కార్మికులు ఆకలి చావులకు గురవుతున్నారన్న ఆందోళన నెలకొన్నది. టెండర్ విధానం ద్వారా కొనుగోలు చేసే పద్ధతికి స్వస్తి పలకాలని, పాత విధానం ద్వారా టెస్కోకు నేరుగా ఆర్డర్ ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. టెండర్ విధానాన్ని రద్దు చేయాలని వరంగల్ జిల్లా చేనేత సంఘాల ప్రతినిధులు తాజాగా చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కూడా కలిశారు. తమ బాధను వివరించారు. నానాటికీ తగ్గిపోతున్న ఈ రంగంపై టెండర్ల విధానం అమలు చేయాలన్న కుట్ర నుంచి కాపాడాలని చేనేత సంఘం నాయకులు ఎలుగం పెద్ద భద్రయ్య, పంతంగి శ్రీనివాస్, ముషంబత్తుల కుమారస్వామి, అడిగొప్పుల సంపత్ తదితరులు మంత్రిని కలిశారు. గత విధానాలనే అమలు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు






