- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోజుకు 20 గంటలు.. గెలుపు కోసం ప్రధాన పార్టీల నయా స్ట్రాటజీ!
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు రోజుకు 20 గంటల పాటు శ్రమిస్తున్నారు.

దిశ, సిటీబ్యూరో : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు రోజుకు 20 గంటల పాటు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లీస్, బీజేపీ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఓ షెడ్యూల్ ప్రకారం కాలనీలు, బస్తీలు, మురికివాడలతో పాటు ఎక్కువ మంది ఓటర్లున్న అపార్ట్‌మెంట్లే లక్ష్యంగా చేసుకుని ప్రచారంలో దుమ్మురేపుతున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుమారు నాలుగు నుంచి అయిదు ఏరియాల్లో పాదయాత్ర నిర్వహించి, మధ్యాహ్నం అరగంట లంచ్‌కు కేటాయిస్తున్నారు. కొందరు అభ్యర్థులైతే పాదయాత్ర నిర్వహించినానంతరం స్థానికంగా ఉన్న కార్యకర్తల శిబిరాల్లోనే వంటావార్పు నిర్వహించి, అక్కడే పార్టీ కార్యకర్తలు, నేతలతో కలిసి లంచ్ చేసుకుని కేవలం గంటసేపు రెస్టు తీసుకుని మళ్లీ పాదయాత్రలకు సిద్దమవుతున్నారు. ద్విముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఒక అభ్యర్థి పాదయాత్ర నిర్వహించిన ప్రాంతాలనే టార్గెట్ చేసుకుని పత్యర్థ అభ్యర్థి ప్రచారం నిర్వహిస్తూ స్థానికంగా రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు.
రాత్రి 8 గంటల వరకు పాదయాత్రలను కొనసాగిస్తున్న అభ్యర్థులు, ఒక రోజు ముంద పాదయాత్ర నిర్వహించిన ప్రాంతంలో మరుసటి రోజున రాత్రి 8 నుంచి 10 గంటల వరకు బహిరంగ సభలు, సమావేశాలను నిర్వహిస్తూ ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలు వంటివి చేస్తూ బిజీగా ఉన్నారు. రాత్రి 10 గంటలకు బహిరంగ సభలు ముగిసిన తర్వాత పార్టీ కార్యకర్తలతో గ్రూప్ మీటింగ్‌లు వంటివి నిర్వహిస్తూ రాత్రి రెండు నుంచి మూడు గంటల వరకు వర్కవుట్ చేస్తున్నట్లు సమాచారం.
మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రించి మరుసటి రోజు ఏడు గంటల కల్లా మళ్లీ బయటపడుతున్నట్లు సమాచారం. నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్, బీజేపీ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో చాలా వెనకబడిపోయారు. కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గద్దర్ కూతురు వెన్నెల, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా నియోజకవర్గాలకు చెందిన బీజేపీ అభ్యర్థులు కూడా మజ్లీస్ ప్రచారంతో పోల్చితే చాలా వెనకబడిపోయారనే చెప్పవచ్చు. అంబర్‌పేటలో బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేసింది.
బస్తీలు, మురికివాడలే లక్ష్యంగా..
ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల నుంచి జాతీయ, ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర్యులతో కలుపుకుని మొత్తం 312 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కానీ వీరిలో యాక్టీవ్‌గా ప్రచారం చేసే వారు అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలకు చెందిన వారే. 15 నియోజకవర్గాల్లోని మజ్లిస్ కేవలం 9 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీతో తలపడుతుండగా, మిగిలిన ఆరు స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే గట్టిపోటీ నడుస్తుంది. మొత్తానికి 312 మంది అభ్యర్థుల్లో సీరియస్‌గా ప్రచారం చేస్తూ అహార్నిశలు బిజీబిజీగా గడుపుతున్న అభ్యర్థుల సంఖ్య దాదాపు 60 నుంచి 70 మధ్య ఉన్నట్లు సమాచారం. పార్టీ అభ్యర్థుల విజయాన్నే బాధ్యతగా భుజానవేసుకున్న మజ్లిస్ అధినేత అసదుద్దిన్ ఒవైసీ కూడా రోజుకు 20 గంటల పాటు వర్కవుట్ చేస్తున్నట్లు సమాచారం.
బైక్ అయితే చాలా ఈజీ..
నగరంలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న మజ్లిస్ పార్టీ అధినేత తొమ్మిది మంది అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు స్పెషల్ షెడ్యూల్‌ను రూపొందించుకున్నట్లు సమాచారం. కారులో తిరిగితే అభ్యర్థులకిచ్చిన టైమ్‌కు స్పాట్ చేరుకోలేమని భావించిన అసద్ ఈ మధ్య బైక్ పైనే సభలు, సమావేశాలు, పాదయాత్రలకు హాజరవుతున్నారు. అయిదు రోజుల క్రితం నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓవైసీపురాలో సాయంత్రం ఎనిమిది నుంచి పది గంటల మధ్య నిర్వహించిన బహిరంగ సభకు ఇచ్చిన సమయానికి బైక్ పై వచ్చి అసద్ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.
ఇదేమిటీ? ఎంపీ, ఆపై పార్టీ అధినేత బైక్ రావటం ఏమిటీ? అన్ని కొందరు ప్రశ్నించగా, కారులో పయనిస్తే ట్రాఫిక్ జామ్ అయి టైమ్ వేస్ట్ అవుతుందని, బైక్ పైనే పాదయాత్రలు, సభలు, సమావేశాలకు అసద్ హాజరవుతున్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకోవటం కనిపించింది. మజ్లీస్ అభ్యర్థులు కూడా పాదయాత్ర నిర్వహించాల్సిన ప్రాంతానికి చేరుకున్న తర్వాత తమ వాహనాలను ఉపయోగించకుండా వెనక్కి పంపించి ఒక ఏరియాలో పాదయాత్ర నిర్వహించినానంతరం మరో ఏరియాకు కార్యకర్తలు బైక్‌లపైనే మరో ప్రాంతానికి వెళ్తున్నట్లు తెలిసింది.






